బాబాలు, గురువులు ఎలా పుడతారు? | this is how babas and gurus emerge | Sakshi
Sakshi News home page

బాబాలు, గురువులు ఎలా పుడతారు?

Published Mon, Aug 28 2017 3:28 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

this is how babas and gurus emerge



న్యూఢిల్లీ:
బాబాలు, గురువులు ఏ సమాజంలోనైనా ఆ సమాజంలోని బలహీన ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆసరాగానే పుట్టుకొస్తారు. ప్రజలకు నాలుగు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి వారి నుంచి తమకు కావాల్సిన వాటిని వెనకేసుకుంటారు. వాటిలో డబ్బు, దస్కంతోపాటు రాజకీయ పలుకుబడి వరకు ఏమైనా ఉండవచ్చు. అన్ని సమకూరాక విలాస పురుషులుగా మారి శంగార లీలలు సాగించవచ్చు. వారిలో కొందరు గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తరహాలో ఆరాచకాలకు పాల్పడవచ్చు. ఇక సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతల కారణంగా ప్రజల నుంచి బాబాలకు, గురువులకు అనుచరులు పెరుగుతారు.

సామాజిక అసమానతలంటే ఇక్కడ కుల, మతాలు ప్రధానం. ముఖ్యంగా చిన్న కులాలవారు, మధ్యతరగతి వారే ఎక్కువగా ఇలాంటి బాబాలను, వారి ఆశ్రమాలను ఆశ్రయిస్తారు. అక్కడికి వచ్చే వారందరి మధ్య వారికి సమానత్వ భావన కలుగుతుంది. తరతరాలుగా సామాజిక చిన్న చూపునకు గురవడం వల్ల వారికి సమాన త్వ భావన సంతప్తిని కలిగిస్తుంది. ఏ మతం కల్పించని ఇలాంటి సమానత్వ భావాలను వ్యాప్తి చేయడం ద్వారానే బాబాలు ప్రజలను ఆకర్షిస్తారు. అనవసర భయాలు, అపోహలు, మానసిక రుగ్మతల కారణంగా డబ్బులు దండిగా ఉన్నవాళ్లు కూడా బాబాలను ఆశ్రయిస్తుంటారు. చట్టాలకు లోబడి బాబాలు, గురువులు ఆశ్రమాలను నిర్వహించినంతకాలం వారికేమీ ఢోకా ఉండదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డప్పుడు చిక్కుల్లో పడాల్సి వస్తుంది.



తాము ఇంతకాలం నమ్ముతూ వచ్చిన బాబాలు, గురువులకు ఏమైనా కీడు జరిగినప్పుడు వారి అనుచరులకు ఆవేశం కట్టలు తెంచుకోవడం, వారు విచక్షణా రహితంగా విధ్వంసానికి పాల్పడడం కూడా సహజం. ఎందుకంటే వారంతా సామాజిక అణచివేతకు గురవుతూ రావడం వల్ల వారిలో అసహనం పేరుకుపోయి ఉంటుంది. విచక్షణా జ్ఞానం లేకుండా పోతుంది. డేరా స్వచ్ఛా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు ద్రోహిగా తేల్చినప్పుడు కూడా ఆయన అనుచరులు అలాగే స్పందించారు. ఢిల్లీలో యమునా నది పక్కన మహా సమ్మేళనం నిర్వహించడానికి శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమానికి అనుమతి ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం తొలుత నిరాకరించినప్పుడు కూడా ఆయన ఆనుచరులు ఇలాగే విధ్వంసానికి దిగారు.

దేశ సామాజిక, ఆర్థిక అసమాన పరిస్థితుల కారణంగానే భారత్‌లో స్వామినారాయణ్‌ ఆశ్రమం, రామకష్ణ మిషన్, సొహామి సత్సంగ్, డివైన్‌ లైట్‌ మిషన్‌ లాంటివి పుట్టుకొచ్చాయి. అందుకే అభివద్ధి చెందిన దేశాల్లో ఆశ్రమాలు అతి తక్కువగా కనిపిస్తాయి. దేశంలోని ఆశ్రమాల్లో ప్రజాసేవే పరమావధిగా కొన్ని వెలిస్తే, ప్రజాసేవ పేరిట సొమ్ము చేసుకోవడానికి కొన్ని వెలిసాయి. మరికొన్ని సత్సంకల్పంతో వెలసిన కాలక్రమంలో స్వార్థపూరితంగా మారిపోయాయి. ప్రజలను ఆకర్షించేందుకు బాబాలు, గురువులు కాలాన్నిబట్టి తమ వేషధారణలను, పద్ధతులను మార్చుకుంటూ వచ్చారు. వారిలో రామ్‌ రహీమ్‌ సింగ్‌ మబరో అడుగు ముందుకేసారు. పంజాబ్‌ సంస్కతిలో భాగమైన భాంగ్ర నత్యానికి పాప్‌ను, రాక్‌ను జోడించి యువతను ఆకట్టుకున్నారు. వేష ధారణతో పాప్‌ సింగర్‌ ఇమేజ్‌ను పెంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకోవడానికి మంత్ర, తంత్రాలను ప్రదర్శించే బాబాలు ఈ ఆశ్రమాల కోవ కిందకు రారు. వారంతా మాయగాళ్లు, మోసగాళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement