ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని | This is the capital of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని

Published Tue, Jul 21 2015 12:51 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని - Sakshi

ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని

కీలక ప్రభుత్వ నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే..! 
ఐదు దశల్లో పీపీపీ విధానంలో రాజధాని నిర్మాణం
2050 నాటికి పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి

 
హైదరాబాద్: ఆంధ్రుల రాజధాని అమరావతి కీలక ప్రాంతమంతా (కోర్ ఏరియా) తుళ్లూరు పరిసరాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోనే నిర్మితం కానున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర మంత్రుల నివాస గృహాలు, సిటీ గ్యాలరీ తదితర నిర్మాణాలు తుళ్లూరు పరిసరాల్లోనే నిర్మిస్తారని ‘సాక్షి’ ముందుగానే వెల్లడించింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తుళ్లూరు కేంద్రంగానే భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో అప్పట్లో ఇక్కడే ప్రభుత్వ కీలక నిర్మాణాలు ఉంటాయని భావించారు. ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వం అందించిన చివరి విడత ప్రధాన రాజధాని ప్రణాళిక (సీడ్ కేపిటల్ ప్లాన్) ప్రకారం అమరావతి గవర్నమెంట్ కోర్ ప్రాంతం మొత్తం లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, తుళ్లూరులలో ఉంటుందని రూఢీ అయ్యింది.

నాలుగు భాగాలుగా విభజన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి అందించిన సీడ్ కేపిటల్ ప్రణాళికలో నాలుగు భాగాలుగా విభజించారు. అమరావతి గేట్ వే, అమరావతి వాటర్ ఫ్రంట్, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్ పేరుతో అభివృద్ధి చేయనున్నారు. ఓ మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను ఏడు రంగాల్లో హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను ఏపీ ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సోమవారం రాజమండ్రిలో అందజేశారు. ఈ సీడ్ కేపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ పరిధి 16.9 చదరపు కి.మీ. ఉంటుంది. సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దశలో కేపిటల్ సీడ్ మాస్టర్ ప్లాన్ 8 చ.కి.మీ. మాత్రమే ప్రతిపాదించారు. తాజాగా అందించిన ప్రణాళికలో మాత్రం దాన్ని రెండింతలు పెంచి 16.9 చ.కి.మీ. మేరకు చూపించారు. ఐదు దశల్లో సీడ్ కేపిటల్ ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టీకరించింది.

2050 నాటికి అమరావతి రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రణాళికలో పొందుపరిచారు. అమరావతి గేట్ వే భాగం తాళ్లాయపాలెం పరిధిలో ఉంటుంది. ఇక్కడే గత నెల 6నముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ గ్రామం మందడం రెవెన్యూ గ్రామం కింద ఉంది. ఇక్కడ సిటీ గ్యాలరీ, వెట్‌ల్యాండ్ పార్క్, కల్చరల్ సెంటర్, అమరావతి ప్లాజా, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. అమరావతి డౌన్ టౌన్ భాగంలో ఉద్దండరాయునిపాలెం, లంక గ్రామాలున్నాయి. ఈ గ్రామాలను ఆనుకుని అమరావతి వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం నడుమ స్పోర్ట్స్ సౌకర్యాలు, బొటానికల్ గార్డెన్స్, ప్రాంతీయ ఆసుపత్రి, కెనాల్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లింగాయపాలెం నుంచి తుళ్లూరు వరకు సెమీ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ ఉండాలని ప్రణాళికలో సూచించారు.

 రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే..
 రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే ఉండేలా ప్లాన్ రూపొందించారు. అమరావతి మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హబ్‌ల పేరుతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ రెండు జిల్లాల్లో గుంటూరులో ఆగ్రో ప్రాసెసింగ్ హబ్, తెనాలిలో లైట్ ఇండస్ట్రియల్ సపోర్ట్ హబ్, సత్తెనపల్లిలో హెవీ ఇండస్ట్రీ, నందిగామలో టూరిజం, నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్, గన్నవరంలో ఫ్యూచర్ ఏరోట్రోపోలీస్ (విమానయాన సంబంధిత), గుడివాడలో వాల్యూయాడెడ్ ఎకనమిక్ హబ్‌లను అభివృద్ధి చేస్తారు. అమరావతి వారసత్వ నగరంగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో పామర్రు-మచిలీపట్నం నడుమ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఉంటుందని ప్లాన్‌లో పేర్కొన్నారు.
 
ఐదు గ్రామాలు ఖాళీ  కావాల్సిందే!

సింగపూర్ ప్రభుత్వం రూపొందించే మాస్టర్ ప్లాన్ గ్రామాలను తాకకుండా ఉంటుంది.. ఆ విధంగానే ప్లాన్ రూపొందించాలనిచెప్పామని పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. అందుకు భిన్నంగా ఐదు గ్రామాలు కచ్చితంగా ఖాళీ చేయక తప్పదని సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం తెలుస్తోంది. గ్రామాల వెలుపలి నుంచి మాత్రమే ప్రణాళిక రూపొందుతుందని ఏపీ మంత్రి నారాయణ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్ ప్రకారం కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే ఉండటంతో ఎంతో చరిత్ర ఉన్న కృష్ణా పరివాహక గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. మాస్టర్ ప్లాన్‌లో సూచించిన మేరకు తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, ప్రభుత్వ కీలక నిర్మాణాలు నిర్మించే వెలగపూడి, రాయపూడి గ్రామాలు ఖాళీ చేయక తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి. తుళ్లూరు పరిసర గ్రామాలపైనా పాక్షికంగా ప్రభావం ఉంటుంది.
 
ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్
http://img.sakshi.net/images/cms/2015-07/81437420314_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement