నిజానిజాల కోసం 23 ఏటీఎంలు తిరిగాడు!
నల్లధనంపై పోరాటం కోసమంటూ.. దేశంలో మార్పు కోసమంటూ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవైపు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు కష్టాలు పడుతుండగా.. మరోవైపు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. క్యూలో నిలబడి నిలబడి ప్రజలు కొంతమంది ప్రాణాలు విడుస్తుండగా.. ఏకంగా పార్లమెంటులోని ఏటీఎంలోనూ డబ్బులు అయిపోయి.. ఔవటాఫ్ సర్వీస్ మోడ్‌లోకి వెళ్లింది.
ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన టిను చెరియర్ అబ్రహం సొంతంగా నిజానిజాలు తెలుసుకోవడానికి బయలుదేరాడు. నగరంలోని ఏటీఎంలు నిజంగా పనిచేయడం లేదా? లేక మీడియానే కావాలని కథనాలు వండి వారుస్తున్నదా? అన్నది చెరియన్ సందేహం. అందుకే మీడియా కథనాల్లోని నిజానిజాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు అతను బెంగళూరులోని 23 ఏటీఎంలను సందర్శించాడు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇలా దాదాపు నగరంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలను చెక్ చేశాడు. మీడియా కథనాలు ఏమో కానీ అతనికి నిజాలు ప్రత్యక్షంగా చూసి బిత్తరపోయినంత పని అయింది. అతను తిరిగిన ఏటీఎంలన్నీ మూతబడి ఉన్నాయి. గతంలో ఎన్నడూ మూతపడి ఎరుగని ఏటీఎంలు సైతం ఇప్పుడు మూతపడ్డాయని అతను వరుస ట్వీట్లలో తెలిపాడు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నగదు కష్టాలను ఈ ట్వీట్లు చాటుతున్నాయని, పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.