ఆ రైలు స్పీడ్.. గంటకు 3,000 కిలోమీటర్లు!
లండన్: విమానం వేగం ఎంత? సాధారణంగా గంటకు 500 కిలోమీటర్లు.. జెట్ విమానమైతే గంటకు 800 కిలోమీటర్లు ఉంటుంది. మరి అంతకన్నా వేగంగా వెళ్లాలంటే..! అదీ భూమ్మీదే రైల్లో గంటకు 3,000 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగితే! చైనాలోని సౌత్‌వెస్ట్ జియావోటోంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెంగ్ జిగాంగ్ ప్రయోగాలు ఫలిస్తే.. ఇది త్వరలోనే సాకారమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ‘మెగా థర్మల్ సూపర్ కండక్టింగ్ మాగ్నటిక్ లెవిటేషన్ (మాగ్‌లెవ్)’ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న రైళ్లు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతున్నాయి. భూమి మీది గాలి నిరోధం, పీడనం కారణంగా అంతకన్నా వేగంగా వెళ్లలేకపోతున్నాయి.
అందువల్ల వ్యాక్యూమ్ ట్యూబ్ (గాలిని పూర్తిగా తీసేసే గొట్టాలు లేదా సొరంగాలు వంటి మార్గాలు)లను ఏర్పాటు చేసి.. వాటిలో ‘మాగ్‌లెవ్’ రైళ్లను నడిపితే.. దాదాపు 3 వేల కి.మీ. వేగంతో దూసుకెళ్లగలవని జిగాంగ్ చెబుతున్నారు.