train speed
-
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
రైళ్లిక రయ్.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!
సాక్షి, హైదరాబాద్: రైలు అనగానే.. నెమ్మది ప్రయాణం, అనుకున్న సమయానికి గమ్యం చేరదన్న అభిప్రాయమే మదిలో మెదులుతుంది. ఆ అపప్రదను చెరిపేస్తూ విప్లవాత్మక మార్పులతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే మరో చారిత్రక ఘనతను సాధించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు విజయవంతం కావటంతో నిర్దిష్ట రూట్లలో రైళ్లు గరిష్ట వేగంతో దూసుకుపోయేందుకు అనుమతి లభించింది. దీంతో సోమవారం నుంచి ఆయా మార్గాల్లో సాధారణ రైళ్లు కూడా గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు పెట్టనున్నాయి. మూడేళ్ల కసరత్తు తర్వాత.. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని దశలవారీగా పెంచాలని నిర్ణయించిన రైల్వే అందుకోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది. రైలు మార్గాల్లో కీలకమైన స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాల్లో తొలుత దీన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి, ఆ మార్గాల్లో ట్రాక్‌లు 130 కి.మీ వేగాన్ని తట్టుకునేలా పటిష్టం చేసింది. కోవిడ్ సమయంలో రైళ్ల రాకపోకలపై నిషేధం ఉండటాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పటిష్టపరిచే పనులను వేగంగా పూర్తి చేసింది. ఇటీవలే ముంబయి, చెన్నై మార్గాల్లో కొన్ని రైళ్లు ఈ వేగంతో వెళ్లేలా అనుమతించిన రైల్వే, తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ అనుమతినిచ్చింది. ఏ డివిజన్లో ఏయే మార్గాలు..? ప్రస్తుతం అన్ని మార్గాల్లో ఈ వేగం సాధ్యం కాదు, ట్రాక్‌ను పటిష్టపరిచిన పరిమిత మార్గాల్లోనే ఇది సాధ్యమవుతుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా, కాజీపేట–కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్ పరిధిలోని కొండపల్లి–విజయవాడ–గూడూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని రేణిగుంట–గుంతకల్–వాడి సెక్షన్ల పరిధిలో ఈ వేగానికి అనుమతించారు. ఈ మార్గాలు నిత్యం అన్ని వేళలా రద్దీగా ఉండేవి కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు.. ప్రీమియం రైళ్లుగా ఉన్న రాజధాని, దురొంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని గత ఏప్రిల్‌లోనే 130కి పెంచారు. అప్పటివరకు అవి 120 వేగంతో వెళ్లేవి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇంతకాలం గంటకు 110 కి.మీ. వేగంతో వెళ్తూ వస్తున్నాయి. ఇప్పుడివన్నీ ఆయా రూట్లలో 130 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతానికి ప్యాసింజర్ రైళ్ల వేగం కొంత తక్కువే ఉండనుంది. ఎక్కువ స్టాపులుండటం, సిగ్నళ్ల పరిధి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇక గూడ్సు రైళ్లు కూడా ఇప్పుడు వేగంగా దూసుకుపోయేలా మార్చారు. వాటిల్లో వ్యాగన్ల రకాన్ని బట్టి వేగంలో కొంత మార్పులుంటాయి. కొన్ని గంటకు 130 కి.మీ. వేగంతో, కొన్ని 100 కి.మీ, మరికొన్ని 80 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ (గ్రాండ్ ట్రంకు కారిడార్) మార్గాలు కాకుండా త్వరలో మరిన్ని కారిడార్లను కూడా పటిష్టం చేసి మిగతా రూట్లలో కూడా రైళ్లను 130 కి.మీ. వేగంతో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైలు.. @130
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆరు ప్రధాన రూట్లలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల మేర పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చేందుకు ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, ఢిల్లీ–హౌరా, ముంబై–హౌరా, హౌరా–చెన్నై రూట్లలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. వీటిలో ఢిల్లీ–ముంబై మినహా మిగిలిన ఐదు రూట్లు ఏపీ పరిధిలోనూ ఉన్నాయి. ఈ మార్గాల్లో కన్ఫర్మేటరీ ఆసిల్లోగ్రాఫ్ కార్ రన్ (సీఓసీఆర్) టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పడుతున్న సమయం కన్నా అరగంట ఆదా ► ముంబై–చెన్నై ప్రధాన మార్గంలో గల గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. 280 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైలు మార్గంలో టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది. ► ఈ పరీక్షలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సమయం కంటే అరగంట ఆదా అయింది. ఈ మార్గంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల వేగం 90 కిలోమీటర్ల వరకు ఉంది. ► ఈ వేగాన్ని 130 కి.మీ వరకు పెంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ► గుంతకల్లు–రేణిగుంట మార్గంలో ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్‌పై టెస్ట్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. 130 కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతుంటే పట్టాలు తట్టుకోగలవా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ► టెస్ట్ డ్రైవ్ విజయవంతమైన తర్వాత రైల్వే భద్రత కమిషన్ (సీఆర్సీ) కూడా పరిశీలించి అనుమతులిస్తుంది. ► ముంబై–చెన్నై మార్గంలో ఏపీ పరిధిలోని గుంతకల్ డివిజన్ పరిధిలో 1,330.90 కి.మీ. ట్రాక్ ఉంది. రైల్వే గేట్ల ఎత్తివేత దిశగా.. ► గంటకు 130 కిలోమీటర్ల వేగం పెంచే ఈ ప్రధాన రైలుమార్గాల్లో దాదాపు రైల్వే గేట్లను ఎత్తివేసేందుకు రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ► ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న గేట్ల స్థానంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మిస్తోంది. పలు గేట్ల స్థానంలో ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో 30 లెవల్ క్రాసింగ్ గేట్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ► మూసివేయాలనుకుంటున్న ఎల్సీ గేట్ల స్థానంలో ఒక్కో ఆర్యూబీ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల లోపు వ్యయమవుతుందని అంచనా. -
రైలు ప్రయాణీకులకు తీపికబురు
సాక్షి, కోల్‌కతా : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వేలు ఊరట కల్పించాయి. 2022 నాటికి దూర ప్రాంత రైళ్ల వేగాన్ని గంటకు 25 కిమీలకు పెంచాలని రైల్వేలు నిర్ణయించాయి. సరుకు రవాణా రైళ్ల వేగాన్ని రెట్టింపు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరామని రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గొహెయిన్ సోమవారం వెల్లడించారు. దూరప్రాంత రైళ్ల వేగాన్ని ఏటా గంటకు 5 కిమీ మేర వేగం పెంచాలని తాము అన్ని జోనల్ రైల్వే జీఎంలను కోరామని, 2022 నాటికి గంటకు 25 కిమీ వేగం లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ధేశించామని చెప్పారు. ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బావిస్తోందని, తక్కువ సమయంలో ప్రయాణీకులను వారి గమ్యస్ధానాలకు చేరవేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓవర్‌నైట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. -
పెరిగిన రైళ్ల వేగం!
సాక్షి, హైదరాబాద్: ఇకపై రైళ్ల వేగం పెరగనుంది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా నడిచే 64 రైళ్ల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం నడుస్తున్న సమయం కంటే ముందుగానే గమ్యం చేరుకుంటాయి. ఈ మేరకు కొత్త సమయపట్టికను విడుదల చేశారు. మంగుళూరు–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 3.55 గంటలపాటు తగ్గించారు. 4 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించటంతోపాటు ఒక రైలు ఫ్రీక్వెన్సీని పెంచారు. 146 రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. -
ఆ రైలు స్పీడ్.. గంటకు 3,000 కిలోమీటర్లు!
లండన్: విమానం వేగం ఎంత? సాధారణంగా గంటకు 500 కిలోమీటర్లు.. జెట్ విమానమైతే గంటకు 800 కిలోమీటర్లు ఉంటుంది. మరి అంతకన్నా వేగంగా వెళ్లాలంటే..! అదీ భూమ్మీదే రైల్లో గంటకు 3,000 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగితే! చైనాలోని సౌత్‌వెస్ట్ జియావోటోంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెంగ్ జిగాంగ్ ప్రయోగాలు ఫలిస్తే.. ఇది త్వరలోనే సాకారమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ‘మెగా థర్మల్ సూపర్ కండక్టింగ్ మాగ్నటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్)’ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న రైళ్లు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతున్నాయి. భూమి మీది గాలి నిరోధం, పీడనం కారణంగా అంతకన్నా వేగంగా వెళ్లలేకపోతున్నాయి. అందువల్ల వ్యాక్యూమ్ ట్యూబ్ (గాలిని పూర్తిగా తీసేసే గొట్టాలు లేదా సొరంగాలు వంటి మార్గాలు)లను ఏర్పాటు చేసి.. వాటిలో ‘మాగ్లెవ్’ రైళ్లను నడిపితే.. దాదాపు 3 వేల కి.మీ. వేగంతో దూసుకెళ్లగలవని జిగాంగ్ చెబుతున్నారు.