ప్రజా ప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జైల్లోని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదనడం పొరపాటే: సిబల్
జైల్లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేనని రాజ్యసభ ఉద్ఘాటించింది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తీసువచ్చిన బిల్లుకు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జైల్లో ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వంతోపాటు అనేక రాజకీయ పక్షాలు విభేదించాయి. తీర్పునకు కారణమైన ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని సవరించాలని డిమాండ్ చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టం (సవరణ, చెల్లుబాటు) బిల్లు-2013ను తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 62లోని సబ్‌క్లాజ్ 5కు సవరణలు ప్రతిపాదించారు. ఈ బిల్లును మంగళవారం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ కూడా ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 2013, జూలై 10 రోజు నుంచి చట్టం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. వాస్తవానికి సుప్రీం తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికే అప్పీలు దాఖలు చేసింది. అయితే తీర్పు వచ్చేదాకా వేచిచూడకుండానే బిల్లును తీసుకువచ్చింది.
నాయకులంతా నేరగాళ్లేనన్న అపోహ ఉంది: సిబల్
రాజకీయ నాయకులను క్రిమినల్స్‌గా చిత్రీకరించే విషయంలో కోర్టులు అత్యుత్సాహం చూపుతున్నాయని సిబల్ పేర్కొన్నారు. బిల్లును ప్రవేశపెడుతూ ఆయన సభలో మాట్లాడారు. ‘‘దేశంలో రాజకీయ నేతలంతా నేరగాళ్లే అన్న అపోహ ఉంది. కోర్టులు కూడా వారిని అలా చూపేందుకే ప్రయత్నిస్తుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ వెలువరించిన తీర్పు క చ్చితంగా పొరపాటేనని చెప్పారు. ఓటుహక్కు, ఓటర్ల జాబితా అంశాలకు రాజ్యాంగంలోని ప్రత్యేక సెక్షన్లు పెద్దపీట వేశాయని గుర్తుచేశారు. దోషిగా నిరూపితం కానంత వరకు ప్రతి ఒక్కరిని అమాయకుడిగానే చూడాలన్నారు. ‘‘పొరపాట్లు అందరూ చేస్తారు. మనం తప్పులు చేస్తాం. జడ్జిలు కూడా తప్పులు చేస్తారు. అందుకే దేశ రాజకీయాలపై ప్రభావం చూపే తీర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని అన్నారు. సిబల్ వ్యాఖ్యలపై సభలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. కోర్టుల పట్ల గౌరవంగా ఉండాలని బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ సూచించగా.. సమాజ్‌వాది పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ సిబల్‌కు దన్నుగా నిలిచారు. దీంతో సిబల్ మళ్లీ మాట్లాడుతూ.. తనకు న్యాయవ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని చెప్పారు. అందుకే మనం ఏ ఒక్క జడ్జి గురించిగానీ, కోర్టు గురించిగానీ ప్రతికూల వ్యాఖ్యలు చేయం అని అన్నారు.
జైల్లో ఉన్నవారూ పోటీకి అర్హులే
Published Wed, Aug 28 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement