గుజరాత్ రాష్ట్రంలోని వడొదర నగరంలో అట్లాండర ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించారని నగర పోలీసు కమిషనర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను నగరంలోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
ఆ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వడొదర మేయర్, మున్సిపల్ కమిషనర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను వారు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. 13 నుంచి 14 కుటుంబాలు కుప్పకూలిన భవనంలో నివాసం ఉంటున్నారని చెప్పారు. శిథిలాలను తొలగిస్తే గాని మరణించిన, గాయపడిన వారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని మేయర్ ఓ ప్రకటన తెలిపారు. అట్లాండర గ్రామం కొద్ది సంవత్సరాల క్రితమే వడొదర నగరంలో విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను అన్వేషిస్తామని మేయర్ ఈ సందర్భంగా చెప్పారు.