మోడీ ప్రధాని అయితే అమెరికా ఆపగలదా?
దేవయానీ ఖోబ్రగడే విషయంలో తల బొప్పి కట్టించుకున్న అగ్రరాజ్యం అమెరికా ముందు ఇప్పుడు మరో పెద్ద బండ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్రమోడీ నిజంగానే రేపు ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయితే.. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని టైమ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. పనిమనిషి వీసా కేసులో అమెరికాలో తీవ్ర అవమానానికి గురైన తర్వాత భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడే భారతదేశానికి తిరిగి వెళ్లారని ఆ పత్రిక తన తాజా సంచికలో రాసింది. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు అంత త్వరగా మెరుగుపడతాయని తాము అనుకోవట్లేదని, నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడంతో, రేపు ఆయన ప్రధానమంత్రి అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది. ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా రాసింది. నరేంద్ర మోడీ 'అమెరికాకు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి' అని, ఆయనపై హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినా, భారతీయ కోర్టులేవీ ఆయనను బాధ్యుడిగా పేర్కొనలేదని 'టైమ్' పత్రిక తెలిపింది.
మతస్వేచ్ఛకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భంగం కలిగించేలా ప్రవర్తించిన నాయకులకు అమెరికన్ చట్టాల ప్రకారం వీసా ఇవ్వబోమంటూ అమెరికా విదేశాంగ శాఖ 2005లోనే నరేంద్ర మోడీకి తమదేశంలో ప్రవేశించడానికి వీల్లేకుండా వీసా నిరాకరించింది. అప్పటికి మోడీ జాతీయస్థాయి నాయకుడు కారని, కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రధాని అయితే.. అంతటి నాయకుడిని అమెరికా నిరాకరించగలదా అని ఆ పత్రిక సూటిగా ప్రశ్నించింది. మోడీ విషయంలో అమెరికా విధాన నిర్ణేతలు కూడా చీలిపోయారని, కొంతమంది మోడీ రాకను వ్యతిరేకిస్తున్నా.. రియలిస్టులు, అమెరికా వ్యాపారవేత్తలు మాత్రం ఆయన రావాలనే కోరుకుంటున్నారని, విదేశీ పెట్టుబడులకు ఆయన అనుకూలంగా ఉంటారన్న విషయాన్ని వారు గ్రహించారని టైమ్ పేర్కొంది.