
వామ్మో! ఇలా కూడా ఆఫీస్‌కు వెళుతారా?
ఆఫీస్‌కు రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం.. మధ్యలో ఆఫీస్‌లో పనిచేయడం.. ఇవి చాలు ఒక సగటు ఉద్యోగి అలిసిపోవడానికి.. దీనికితోడు నగరాల్లో నరకం చూపించే ట్రాఫిక్ గురించి చెప్పకపోవడమే మేలు.. ఆఫీస్‌లో చేసిన వర్క్ కంటే.. ఆఫీస్‌కు రావడానికి, మళ్లీ ఇంటికి వెళ్లడానికి ట్రాఫిక్‌లో ఎదుర్కొనే చిక్కులే ఎక్కువ. దారి పొడగుతా పాములా మెలికలు తిరిగి.. నత్తలా నిదానంగా ముందుకుసాగే ట్రాఫికే చాలామందికి చెప్పలేనంత విసుగు తెప్పిస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కొందరు వినూత్నంగా ట్రాఫిక్ సమస్య తమ దారికి అడ్డురాకుండా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఇదేవిధంగా ఆలోచించి ఓ చెక్ రిపబ్లిక్ వ్యక్తి ఏకంగా చిన్న హెలికాప్టర్ రూపొందించుకొని.. ఆఫీస్ వెళుతుండగా.. జర్మన్‌లో ఓ వ్యక్తి మరింత వినూత్నంగా ఆఫీస్ బాటపట్టాడు.
మ్యూనిచ్‌లో ఉండే బెంజమిన్ డేవిడ్ ట్రాఫిక్ బెదడతో విసిగిపోయాడు. నిత్యం చుక్కలు చూపించే ట్రాఫిక్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. రోడ్డుమార్గంలో వెళితే.. ట్రాఫిక్ ఎదురవుతుంది. అదే నీటిమార్గంలో వెళ్లితే.. వాహనాలు ఉండవు. సిగ్నళ్లు ఉండవు. ట్రాఫిక్ బెడద ఉండదు. అందుకే నగరంలోని ఇసార్ నదిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆ నది మార్గంలో రవాణసౌలభ్యం లేదు. అయినా, బెంజిమిన్ వెనుకకు తగ్గలేదు. రోజూ 1.6 కిలోమీటర్లు (ఒక మైలు) ఎంచక్కా ఈదుకుంటూ వెళుతున్నాడు. ఇంటి నుంచి నేరుగా బెంజమిన్ నదికి వస్తాడు. అక్కడ తన దుస్తులు, బూట్లు, మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాటర్ ప్రూఫ్ బ్యాగులో పెట్టి.. ఎంచక్కా నదిలో దూకేసి ఈదుకుంటూ ఆఫీస్‌కు వెళుతాడు. ఇలా రోజు ఆఫీస్‌కు వెళ్లడం, ఇంటికి రావడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉందని బెంజమిన్ చెప్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతను ఆఫీస్‌కు ఇలాగే వెళుతున్నాడు.