దెబ్బకు దెబ్బ! | Tit for tat: Mamata Banerjee team in MP to probe gang rape | Sakshi
Sakshi News home page

దెబ్బకు దెబ్బ!

Published Thu, Jun 19 2014 2:36 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

దెబ్బకు దెబ్బ! - Sakshi

దెబ్బకు దెబ్బ!

సమకాలిన రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదును చూసి చులాగ్గా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు వచ్చిన ఎటు వంటి అవకాశాన్నైనా ఒడుపుగా పట్టుకోవడానికి తహ తహ లాడుతుంటారు. కలకత్తా కాళీగా పేరు గాంచిన మమతా బెనర్జీ ఈ కోవలోని నాయకురాలే. బెంగాల్ లో తమ అనుమతి లేకుండా బీజేపీ పర్యటించినందుకు కోపగించిన దీదీ రెండు రోజులు తిరక్కుండానే దెబ్బకు దెబ్బ తీశారు.

30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా భియాలీ ఖేలా గ్రామానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని పంపి కమలనాథులకు కంగారు పుట్టించారు. రాజ్యసభ సభ్యుడు సుఖెందు శేఖర్ రే నేతృత్వంలోని ఐదుగురు ఎంపీల బృందం బుధవారం భియాలీ ఖేలా గ్రామాన్ని సందర్శించి బాధితురాలి బంధువులను పరామర్శించారు. ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భియాలీ ఖేలాలో ఓ గిరిజన మహిళపై ఆమె భర్త, బంధువులు సహా పది మంది సామూహిక అత్యాచారానిక పాల్పడిన ఘటన వెలుగు చూడడంతో కలకలం రేగింది.

బెంగాల్ లో హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో బీజేపీ కేంద్ర నాయకుల బృందం ఆదివారం పర్యటించింది. మమత బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ హింస పెరిగిందని ఇక్కడ పర్యటించిన బల్బీర్ పుంజ్ నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం విమర్శించింది. తన అనుమతి లేకుండానే కాషాయ ఎంపీలు బెంగాల్ గడ్డపై అడుగు పెట్టడమే కాకుండా తనపై విమర్శలు గుప్పించడంతో దీదీకి కోపమొచ్చింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కు పంపి ఎత్తుకు పైఎత్తు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి హింస జరిగినా తమ ఎంపీలను పంపుతానని బహిరంగంగా ప్రకటించి కమలనాథులకు సవాల్ విసిరారు. దీదీ, కమల్ నాథుల ఎత్తులు పైఎత్తులు ఎక్కడివరకు వెళతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement