ఆమె బురఖా వేసుకున్నదని!
బురఖా (హిజాబ్) వేసుకొని ఉద్యోగానికి వెళ్లిన ఓ ముస్లిం యువతికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. తమ కార్యాలయంలో 'తటస్థ వాతావరణం' ఉండాలనే సాకుతో ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారు. అగ్రరాజ్యంలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్షకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వర్జినీయా ఫెయిర్ ఫాక్స్ కౌంటీలోని ఫెయిర్ ఓక్స్ డెంటల్ కేర్‌లో డెంటల్ అసిస్టెంట్‌గా నజాఫ్ ఖాన్ పనిచేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ అప్పుడు.. ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి రెండు రోజులు హిజాబ్ ధరించలేదు. కానీ మూడోరోజు బురఖా వేసుకొని వెళ్లింది. దీంతో డాక్టర్ చుక్ జో ఆమెను పిలిచి.. తమ కార్యాలయంలో మతరహిత తటస్థ వాతావరణాన్ని ఉంచాలని భావిస్తున్నానని, నువ్వు తలపై స్కార్ఫ్ ధరిస్తే రోగుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని, కాబట్టి దానిని తొలగించాలని సూచించారు. అందుకు నజాఫ్ ఒప్పుకోకపోవడంతో ఇంటికి దయచేయవచ్చునని ఆయన తేల్చి చెప్పారు. దీంతో షాక్ తిన్న తాను ఉద్యోగాన్ని విడిచి వచ్చానని నజాఫ్ తెలిపారు.
అయితే, తమ కార్యాలయం మతప్రమేయంలేకుండా తటస్థంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగులు కావాలంటే తలపై టోపీ ధరించవచ్చునని, అయితే, పారిశుద్ధ్యం దృష్ట్య సర్టికల్ టోపీ అయి ఉండాలని డెంటల్ కేర్ ప్రధాన డాక్టర్ చుక్ జో తెలిపారు.