
నేడు రంజాన్ పండుగ
- ముగిసిన ఉపవాస దీక్షలు
- ముస్తాబైన ఈద్గాలు, మసీదులు
- శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగను నేడు(శనివారం) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఈద్-ఉల్ -ఫితర్‌ను జరుపుకోవాలని హైదరాబాద్ రువాయత్-ఏ-హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసినట్లయింది.
రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు, మసీదుల్లో ఉదయం ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థనలు పెద్దఎత్తున జరగనున్నాయి. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.