
నేటి నుంచి భారత్-పాక్ సరిహద్దు దళాల చర్చలు
భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య డెరైక్టర్ జనరళ్ల స్థాయి 3 రోజుల చర్చలు గురువారం మొదలు....
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య డెరైక్టర్ జనరళ్ల స్థాయి 3 రోజుల చర్చలు గురువారం మొదలు కానున్నాయి. చర్చలకు భారత్ ఆతిథ్యమిస్తుండగా.. పాక్ నుంచి 16 మంది సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం అమృత్‌సర్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట బుధవారం మరో రెండు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకోవటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు, సిమాంతర చొరబాట్ల అంశాలను భారత్ లేవనెత్తనుంది. ఏడాదిన్నర కాలం తర్వాత.. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్), పాకిస్తాన్ రేంజర్స్ అధిపతుల మధ్య ఈ చర్చలు జరగబోతున్నాయి.
అత్తారి-వాఘా సరిహద్దు వద్ద పంజాబ్ సరిహద్దు బీఎస్‌ఎఫ్ కమాండర్లు పాక్ బృందానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. పాకిస్తాన్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్‌ఫరూక్‌బుర్కీ సారథ్యం వచ్చిన పాక్ బృందానికి ఢిల్లీ విమానాశ్రయంలో బీఎస్‌ఎఫ్ డీజీ డి.కె.పాఠక్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కాగా, తమ అణ్వాయుధాలు ఎవరినీ ఉద్దేశించినవి కావని.. దక్షిణాసియాలో వ్యూహాత్మక సుస్థిరత కోసం తమ దేశం కనీస విశ్వసనీయ హెచ్చరికను పాటిస్తుందని పాక్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ పేర్కొన్నారు.