ముజఫర్నగర్ హింస: మృతుల సంఖ్య 38
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఇంకా చల్లారలేదు. మృతుల సంఖ్య 38కి చేరింది. కర్ఫ్యూ ఇంకా పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం కవాతు చేస్తోంది. హింసాత్మక సంఘటనలలో ఇప్పటివరకు 366 మందిని ఈ కేసుల్లో అరెస్టు చేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన సంఘటనలలో 38 మంది మరణించగా, వీరిలో ఒక్క ముజఫర్నగర్లోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారని హోం శాఖ కార్యదర్శి కమల్ సక్సేనా తెలిపారు.
మీరట్, హపూర్, సహరాపూర్, షామ్లి జిల్లాల్లో 81 మంది గాయపడ్డారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, కొత్తగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ముజఫర్నగర్ జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలీ, నయీ మండీ పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అలాగే ముజఫర్నగర్, షామ్లి, మీరట్ ప్రాంతాల్లో సైన్యం కవాతు చేస్తోందని సక్సేనా తెలిపారు. నిషేధాజ్ఞలను కఠినంగా అమలుచేస్తున్నారు. బీజేఎల్పీ నాయకుడు హుకుమ్ సింగ్, ఎమ్మెల్యేలు సురేష్ రాణా, భర్తేందు, సంగీత్ సోమ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హరేంద్ర మాలిక్ తదితరులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ముజఫర్నగర్ వెళ్లడానికి ప్రయత్నించిన కేంద్ర మంత్రి అజిత్ సింగ్ సహా కొందరు సీనియర్ నాయకులపైనా కేసులు పెట్టారు.
ముజఫర్నగర్ సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోమవారమే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో మాట్లాడారు. కేంద్రం నుంచి కావల్సిన అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.