బురద, శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు
కొనసాగుతున్న అన్వేషణ, సహాయక చర్యలు
167 దాటిన మరణాలు
191 మంది జాడ గల్లంతు
219 మందికి గాయాలు
వయనాడ్/తిరువనంతపురం: ప్రకృతి ప్రకోపానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాడ్ జిల్లా మారుమూల కుగ్రామాల వద్ద అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కుంభవృష్టి వర్షాలతో నానిన కొండచరియలు పడటంతో బురదలో కూరుకుపోయిన ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మీ, సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మరణాల సంఖ్య 167కి పెరిగింది. 191 మంది జాడ తెలియాల్సి ఉంది. 219 మంది గాయపడ్డారు. చిధ్రమైన చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వందలాది మందిని సమీప పట్టణాల ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ గ్రామస్థుల మరణాలతో వారి బంధువుల, ఆక్రందనలు, తమ వారి జాడ కోసం కుటుంబసభ్యుల వెతుకులాటతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద బ్రతికుంటే బాగుణ్ణు అని ఆశ, ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనన్న భయాలతో వందలాది మంది ఆత్మీయులు, మిత్రుల రాకతో ఆ ప్రాంతాల్లో విషాధం రాజ్యమేలింది. కొండపై నుంచి వచ్చిన వరద, బురద ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బుధవారం ఉదయం మాత్రమే పూర్తిస్తాయిలో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టగలిగారు. రెండ్రోజుల్లో 1,592 మందిని కాపాడినట్లు కేరళ సీఎం విజయన్ చెప్పారు.
వేయి మందిని రక్షించిన ఆర్మీ: యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలతో రంగంలోకి దిగిన భారత సైన్యం దాదాపు 1,000 మందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, తీరగస్తీ దళాలు సంయుక్తంగా చేపడుతున్న రెస్క్యూ ఆప రేషన్లతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్లు, తాత్కాలిక వంతెనల సాయంతో ఘటనాస్థలి నుంచి వారికి జాగ్రత్తగా తీసు కొస్తున్నారు. కొందరు మానవహారంగా ఏర్పడి ఆ వలి ఒడ్డు నుంచి కొందరిని ఇటువైపునకు తీసు కొస్తూ సాహసంచేస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌లతో పాటు స్థానికు తమ వంతు సాయం చేస్తున్నారు. శిబిరాలకు 8,017 మందిని తరలించారు.
ఆదుకుంటున్న బెలీ వంతెనలు: 330 అడుగుల పొడవైన తాత్కాలిక బెలీ వంతెనలు నది ప్రవాహం ఆవలివైపు చిక్కుకున్న బాధితులను ఇటువైపు తీసు కొచ్చేందుకు ఎంతగానో ఉపయో గపడుతున్నాయి. 690 అడుగుల బెలీ వంతెనలను ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి తెప్పి స్తున్నారు. మేప్పడి–చూరల్మల వంతెన నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపడు తున్నారు. నిఘా హెలికాప్టర్లు కొండప్రాంతాలు, నదీ ప్రవాహం వెంట తిరుగుతూ బాధితుల జాడ కోసం అన్వేషణ కొనసా గిస్తున్నాయి.
పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ
దిగ్భ్రాంతికర ఘటనలో సహాయక చర్యలు, పునరావాసం తదితర చర్యల పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. కేరళకు పూర్తిస్థాయిలో కేంద్రం మద్దతిస్తోందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఘటనాస్థలిని సందర్శించిన సందర్భంగా చెప్పారు.
కుగ్రామాల్లో శ్మశాన వైరాగ్యం
భారీ శిలలు పడి నేలమట్టమైన ఒక ఇంట్లో నాలుగైదు మంది కుటుంబసభ్యులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే బురదలో కూరుకుపోయిన విషాద దృశ్యం అక్కడి సహాయక బృందాలను సైతం కంటతడి పెట్టించింది. ముండక్కై జంక్షన్, చూరల్మల ప్రాంతాల్లో భీతావహ దృశ్యాలు అక్కడి ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టాయి. ‘‘ ముండక్కై గ్రామంలో ఘటన జరిగిన రోజు దాదాపు 860 మంది జనం ఉన్నారు.
వాళ్లలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలీదు’ అని స్థానికులు వాపోయారు. ‘‘చెట్లను పట్టుకుని కొందరు, చెట్టు కింద పడి మరికొందరు, బురదలో కూరుకుపోయి ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. కురీ్చలో కూర్చుని, మంచాల మీద పడుకుని ఉన్న మృతదేహాలను గుర్తించాం’’ అని సహాయక బృందాలు వెల్లడించాయి. ‘‘అంతా కోల్పోయా. అందర్నీ కోల్పోయా. నాకు ఇక్కడ ఇంకా ఏమీ మిగల్లేదు’ అంటూ ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించారు. ‘‘బురదలో కాలు పెట్టలేకున్నాం. మావాళ్లు ఎక్కడున్నారో’’ అంటూ ఒకరు కంటతడి పెట్టుకున్నారు.
10 శాతం ఇళ్లు మిగిలాయి
ముండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయని ఓ అంచనా. విధ్వంసం తర్వాత 450 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 49 ఇళ్లే మిగిలాయి. బాధితులు అంగన్‌వాడీ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
ముందుగానే హెచ్చరించాం: అమిత్ షా
కుంభవృష్టిపై వారం క్రితమే ముందస్తు హెచ్చరికలు చేశామని రాజ్యసభలో వయనాడ్ విషాదంపై తాత్కాలిక చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘‘ ముందు జాగ్రత్తగా జూలై 23వ తేదీన ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి 9 బృందాలను కేరళకు పంపించాం. వయనాడ్‌లో విలయం మొదలవగానే జిల్లా కలెక్టర్ నుంచి ఈ బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే వాళ్లంతా రంగంలోకి దిగారు.
అన్వేషణ, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కేరళకు పూర్తి స్థాయిలో మోదీ సర్కార్ అండగా నిలుస్తుంది. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి జనాన్ని వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25న రెండుసార్లు హెచ్చరికలు పంపాం. 20 సెం.మీ. భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. స్థానికులను ఎందుకు తరలించలేదు?’’ అని కేరళ సర్కార్‌ను అమిత్ ప్రశ్నించారు.
పంపింది ఆరెంజ్ అలెర్ట్... అదీ 29న: విజయన్
అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు తిరువనంతపురంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీవరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. వర్షాలొస్తాయని భారత వాతావరణ శాఖ వయనాడ్ జిల్లాకు సాధారణ ఆరెంజ్ అలర్ట్‌ను 29వ తేదీన మాత్రమే పంపింది. 20 సెంటీమీటర్లలోపు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్, 24 సెం.మీ.లోపు వర్షాలకు రెడ్ అలర్ట్ ఇస్తారు. కానీ వయనాడ్ జిల్లాలో అసాధారణంగా 572 మిల్లీమీటర్లకు మించి కుంభవృష్టి నమోదైంది. ఇంతటి భారీ వర్షసూచన వాతావరణశాఖ చేయలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం ఆరుగంటలకు రెడ్ అలర్ట్‌ను పంపించారు. వరదపై హెచ్చరించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదు. అయినా ఇది పరస్పర విమర్శలకు సమయం కాదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment