ఫొటోలపై వ్యామోహం.. ప్రాణాలు తీసింది!
ఫొటోలంటే అందరికీ సరదానే. కానీ అందులో ఉన్న రిస్కు తెలుసుకోకపోతే నిండు ప్రాణాలు బలైపోతాయి.
ఫొటోలంటే అందరికీ సరదానే. కానీ అందులో ఉన్న రిస్కు తెలుసుకోకపోతే నిండు ప్రాణాలు బలైపోతాయి. దేశ రాజధానిలో ఇలాగే జరిగింది. రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యశ్ కుమార్ (16), శుభమ్ (14) అనే ఇద్దరూ మరో ఐదుగురితో కలిసి ఒకే ట్యూషన్ సెంటర్‌లో చదువుతున్నారు. వీళ్లు డబ్బు పోగేసుకుని రోజుకు రూ. 400 అద్దెకు ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నారు. వాళ్లంతా కలిసి మోడలింగ్ కోసం ఫొటోలు తీసుకుందామని అనుకున్నారు.
రైలు పట్టాల మీద నిలబడి, వెనకాల రైలు వస్తుండగా దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోప తీసుకోవాలని వాళ్లు ప్లాన్ చేశారు. ఫొటోలు తీయించుకోవడంలో వాళ్లు, తీయడంలో మిగిలినవాళ్లు మునిగిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో రైలును ఎవరూ గుర్తించలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకున్న యశ్, శుభమ్ తాము రెండు రైళ్ల మధ్య నలిగిపోతామన్న భయంతో రెండో ట్రాక్ మీదకు దూకారు. కానీ, ఆ ట్రాక్ మీద అప్పటికే ఒక రైలు వస్తుండటంతో దాని కింద పడి నలిగి చనిపోయారు.
అంతకుముందు రోహిత్ కుమార్, తుషార్ యాదవ్, భవీత్ తోమర్, రోహిత్ సింగ్, అమన్ కుమార్ అనే మరికొందరు స్నేహితులతో కలిసి అక్షర్ ధామ్ వద్దకు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకున్నా, అవి వాళ్లకు అంతగా నచ్చలేదు. దాంతో డేరింగ్ ఫొటోలు తీసుకోవాలనుకుని రైలు పట్టాల వద్దకు వెళ్లారు. యశ్ బాగా తెలివైన విద్యార్థి అని, అతడికి ఫొటోగ్రఫీ అంటే ప్రాణమని అతడి తల్లి చెప్పారు. ఉదయం తన ఫొటోలు కూడా తీశాడని, ఎందుకు తీశావని దెబ్బలాడటంతో వాటిని డిలీట్ చేసేశాడని ఆమె తెలిపారు. ఇన్నాళ్లూ ఎప్పుడూ తన అక్కతో కలిసి ఇంట్లోనే ఫొటోలు తీసుకునేవాడని.. తొలిసారి బయటకు వెళ్లి ఇలా బలైపోయాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.