ఇది జాతీయ విపత్తే: బాబు
సీఎం అసమర్థత వల్ల రైతాంగానికి నష్టం
టీడీపీకి భయపడే విభజన నిర్ణయం
సాక్షి, విజయవాడ: తుపాన్ల నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పర్యటన అనంతరం బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నీలం తుపాను నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం దారుణమన్నారు. తుపాన్లతో రైతాంగం రూ.10 వేల కోట్లు నష్టపోయిందన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తాయని తెలిసి కూడా సకాలంలో ఖరీఫ్‌కు నీరు ఇవ్వకపోవడం వల్లే రైతాంగానికి ఈ కష్టాలు వచ్చాయన్నారు. కేంద్ర బృందం వస్తే రాష్ట్రప్రభుత్వం తుపాను నష్టాలపై నివేదిక కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అసమర్థత వల్ల రైతాంగం నష్టపోవాల్సి వస్తోందన్నారు. హెలెన్ తుపాను నష్టంపై ఇంతవరకూ క్షేత్రస్థాయి పరిశీలనకు రాలేదని సీఎంను విమర్శించారు. పంట రుణాలను, అవసరమైతే అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తుపాన్లు వెంటాడుతుంటే కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల్లో బిజీగా ఉందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని విభజించడానికి సోనియాకు ఉన్న అర్హత ఏమిటని, ఎక్కడో పుట్టి పెరిగిన వ్యక్తికి దేశ రాజకీయాలు ఏం తెలుస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై చర్చ జరగాల్సింది ‘టెన్ జనపథ్’లో కాదని, ఆంధ్రప్రదేశ్‌లో జరగాలన్నారు. తాను జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయమంటే రాష్ట్రంలోని పార్టీలను పిలవడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి లభించిన ఆదరణకు భయపడే రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ‘టీఆర్‌ఎస్‌ని విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్‌ను బయటకు తెచ్చి విభజన ప్రక్రియను ముందుకు తెచ్చార’ని ఆరోపించారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం వచ్చే వరకూ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.