తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా జోరందుకున్నాయి.
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసేవరకు ఉద్యమం ఆగదని, తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి సీమాంధ్రుల తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ పట్ల నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తూ సీమాంధ్ర ఉద్యమానికి సహకరించడం సరికాదని నినాదాలు చేశారు. సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నారని ఆరోపించారు.
ఖమ్మంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు పువ్వులతో వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గె జిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఖాజామియా ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూడటం సీమాంధ్ర ఉద్యోగులకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీనాయకులు కారుమంచి శ్రీనివాసరావు, మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీను, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఉద్యోగ జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటచలపతి రాజు పేర్కొన్నారు.
భద్రాద్రి భవిత అనే అంశంపై గాంధీపథం ఆధ్వర్యంలో పట్టణంలోని అన్నపూర్ణా ఫంక్షన్ హాల్లో చ ర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో పీఆర్ మినిస్టీరియల్ సంఘం జిల్లా కోశాధికారి గౌసుద్ధీన్, గాంధీ పథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రేగలగడ్డ ముత్తయ్య పాల్గొన్నారు.
మధిరలో జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంవద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఏపీఎన్‌జీవోలు చేస్తున్న ఉద్యమానికి నిరసనగా ప్రదర్శన చేశారు. టీజెఏసీ మధిర డివిజన్ చైర్మన్ ఎస్ విజయ్, పట్టణ కన్వీనర్ చెరుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ తాలూకా యూనిట్ అధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచలో టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన సమయంలో ఉద్యోగులు బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.వి.రమణ, ఎస్.కె.మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందులో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పలు శాఖల ఉద్యోగులు భోజన విరామ సమయంలో రెండో రోజు ఆందోళన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇల్లెందు డివిజన్ తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు పి.అప్పారావు, ఉద్యోగ జేఏసీ నాయకులు శ్రీనివాస్, బాలాజీ, మహేష్, రవి,ప్రభావతీ,స్వర్ణలత, మహబూబ్‌అలీ పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మండలపరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ ప్రకాష్‌రావు, ఎంపీడీఓ రవి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఏపీఎన్‌జీఓలు,సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర విభజనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని టీజేఏసీ నాయకులు ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.