సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేయటానికి టీఆర్‌ఎస్ నేతలు రంగంలోకి దిగారు. తమ ప్రత్యర్థులు చేస్తున్న గట్టి ప్రయత్నాలవల్ల తెలంగాణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముందని టీఆర్‌ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యుల బృందం ఢిల్లీలో మకాం వేసి వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుస్తూ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా వాదనలు వినిపిస్తోంది.
అయితే.. ఆంటోనీ కమిటీని కానీ, కాంగ్రెస్ పెద్దలను కలిస్తే అది తప్పుడు సంకేతాలు పుతుందని వారు భావిస్తున్నారు. అయితే.. టీఆర్‌ఎస్ నాయకత్వం వివిధ జాతీయ నాయకులతో భేటీ అవుతుండటంతో.. తనకు గల ‘రాజకీయ అవకాశాలను’ పరిశీలిస్తోందా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీల వివరాలను టీఆర్‌ఎస్ నాయకత్వం మీడియా కంటపడకుండా రహస్యంగానే కొనసాగిస్తుండటం విశేషం.