
దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!
దూషించి.. గద్దించి.. మధ్యలో కాల్ కట్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్న్‌బాల్‌కు గట్టి షాకే ఇచ్చారు. ఇటీవల టర్న్‌బాల్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. శరణార్థుల ఒప్పందం విషయంలో ఆయనపై మండిపడ్డారు. గట్టిగా దూషించి.. మందలించి.. మాట్లాడుతుండగానే మధ్యలోనే ట్రంప్ కాల్ కట్ చేసినట్టు ‘వాషింగ్టన్ పోస్టు’ ఓ కథనంలో తెలిపింది.
అమెరికాకు ఆస్ట్రేలియా అత్యంత సన్నిహిత దేశం. కాబట్టి ట్రంప్-టర్న్‌బాల్ మధ్య సత్సంబంధాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే, శరణార్థుల విషయంలో ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా చేసుకున్న ఒప్పందం విషయంలో ట్రంప్ టర్న్‌బాల్‌పై గుస్సా అయినట్టు తెలుస్తోంది. అయితే, తనను ట్రంప్ తీవ్రంగా మందలించి.. మధ్యలోనే కాల్ కట్ చేసినట్టు వచ్చిన కథనంపై కామెంట్ చేసేందుకు టర్న్‌బాల్ నిరాకరించారు. ఇది పూర్తిగా ప్రైవేటు సంభాషణ అని ఆయన తెలిపారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా తీరప్రాంతంలో ఉన్న దాదాపు 1600 మంది శరణార్థులను మార్చుకునే విషయంలో గత ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. శరణార్థుల రాకను నిషేధిస్తూ ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. ఈ పాత ఒప్పందాన్ని కొనసాగించేందుకు ట్రంప్ అంగీకరించారని ట్రర్న్‌బాల్ గత సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో టర్న్‌బాల్‌పై ట్రంప్ మండిపడినట్టు తెలుస్తోంది.