అమెరికా తర్వాతి టార్గెట్ అదేనా?
వాషింగ్టన్: సిరియాపై దాడికి పాల్పడిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఉత్తర కొరియాపై దృష్టి సారించింది. దుండుకు చర్యలతో తమకు పక్కలో బల్లెంలా తయారైన కొరియాకు కళ్లెం వేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు దిగుతోందన్న కారణంతో కొరియాపై అమెరికా దాడులకు సన్నమవుతున్నట్టు సమాచారం.
ఉత్తర కొరియాపై సైనిక చర్య సహా ఆకస్మిక దాడులకు వెనుకాడరాదని ట్రంప్ యోచిస్తున్నారని వైట్ హౌస్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియాను దారికితెచ్చే విషయంలో చైనా ముందడుగు వేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని శ్వేతసౌధ అధికారి తెలిపారు. కొరియా చర్యలపై ఎలా స్పందించాలన్న దానిపై అమెరికా జాతీయ భద్రతా బృందం ఇప్పటికే వ్యూహాలు రూపొందించినట్టు వెల్లడించారు.
ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలం కావడంతో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఉత్తరకొరియా శనివారం వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శించి ప్రత్యర్థులకు గట్టి సందేశాలు పంపింది. కొరియా చర్యను అమెరికా తప్పుబట్టింది. కవ్వింపు, అస్థిరపరిచే చర్యలకు కొరియా దిగుతోందని అగ్రరాజ్యం పేర్కొంది.