పిట్ట కొంచెం.. లిస్టింగ్ ఘనం!
న్యూయార్క్: సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ స్టాక్ మార్కెట్లోకి బంపర్ అరంగేట్రం చేసింది. పబ్లిక్ ఆఫర్(ఐపీవో) ధర 26 డాలర్లతో పోలిస్తే ట్విట్టర్ గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో 45 డాలర్ల వద్ద లిస్టయ్యింది. ఇది 73% లాభం కాగా, గరిష్టంగా 90% జంప్‌చేసి 50 డాలర్లను తాకింది. కడపటి వార్తలందేసరికి 47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘టీడబ్యూటీఆర్’ పేరుతో కంపెనీ షేర్లు ట్రేడవుతున్నాయి.
ట్విట్టర్ తన ఐపీవోలో ఒకో షేరుకి తుది ధరను 26 డాలర్ల ధరగా నిర్ణయించింది. తద్వారా 210 కోట్ల డాలర్లను సమీకరించింది. వెరసి కంపెనీ విలువ 1,400 కోట్ల డాలర్లను తాకింది. లిస్టింగ్ అనంతరం కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా 2,500 కోట్ల డాలర్లకు ఎగసింది. కాగా, గత ఏడేళ్లలో కంపెనీ లాభాలను ఆర్జించకపోవడం గమనార్హం. నిజానికి ఐపీవో ధరను తొలుత 17-20 డాలర్ల స్థాయిలో కంపెనీ నిర్ణయించింది. ఈ ఆగస్ట్‌లో తమ ఉద్యోగులకు ఇసాప్‌కింద 20.62 డాలర్ల ధరలో సొంత షేర్లను కంపెనీ కేటాయించింది. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన కారణంగా సోమవారం ఐపీవో ధరను 25 డాలర్ల వరకూ పెంచింది. ఐపీవోలో భాగంగా 7 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది.
దీంతోపాటు మరో 1.05 కోట్ల షేర్ల అమ్మకానికి కూడా కంపెనీకి అవకాశముంది. మరో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 2012 మే నెలలో లిస్ట్ అయినప్పటినుంచి ట్విట్టర్ లిస్టింగ్‌పై అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌తో పోలిస్తే ట్విట్టర్ ఐపీవో ధర చాల తక్కువ. ఫలితంగా ట్విట్టర్ విషయంలో ఇన్వెస్టర్లు ఫేస్‌బుక్ ఐపీవో ద్వారా ఎదురైన నష్టాల వంటివి తప్పించుకునే అవకాశాలున్నాయి. 38 డాలర్ల ఐపీవో ధర ద్వారా ఫేస్‌బుక్ 1600 కోట్ల డాలర్లను సమీకరించింది! గరిష్టస్థాయి ధర నేపథ్యంలో ఏడాదికిపైగా గడిచినప్పటికీ ఫేస్‌బుక్ షేరు ఐపీవో ధరను చేరుకోకపోవడం ప్రస్తావించదగ్గ అంశం. అంతేకాకుండా నాస్‌డాక్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఫేస్‌బుక్ ఐపీవోకు ఎదురైన సాంకేతిక ఇబ్బందులను సైతం తప్పించుకునేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోంది. ఈ అంశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ) నాస్‌డాక్‌కు కోటి డాలర్ల జరిమానాను సైతం విధించింది. అమెరికాలోని ఒక స్టాక్ ఎక్స్చేంజ్‌పై ఎస్‌ఈసీ విధించిన అత్యధిక జరిమానా ఇదే కావడం విశేషం! ఇందువల్ల కూడా ట్విట్టర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌కు మొగ్గు చూపింది.