కృష్ణమ్మపై రెండు ‘ఐకాన్ బ్రిడ్జిలు’
* 3 కి.మీ. పొడవుతో, 60మీ. వెడల్పుతో వంతెనలు
* వంతెనలకు ఇరువైపులా ఫుట్, సైకిల్‌పాత్‌లు
* నది మధ్యలో పియర్స్ లేకుండా నిర్మాణం!
* నేల స్వభావాన్ని పరిశీలిస్తోన్న ఇంజనీర్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై అత్యాధునిక టెక్నాలజీతో రెండు ఐకాన్ బ్రిడ్జెస్ (వంతెనలు) నిర్మించేందుకు సీఆర్ డీఏ యోచిస్తోంది.
ఇందుకు అవసరమైన ప్రతిపాదనల తయారీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. అక్టోబరు 22న రాజధాని పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాక వీటి నిర్మాణ పనులపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించనుంది. ఇందుకోసం తొలి దశలో రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేయనుందని అంచనా. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌తో నగర స్వరూపం ఎలా ఉండబోతుందన్న అంశంపై స్పష్టత వచ్చింది.
నగర నిర్మాణ పనులన్నీ వేగంగా జరగాలంటే ఉత్తరంగా ప్రవహిస్తోన్న కృష్ణానదిపై మొదటి దశలోనే రెండు ఐకాన్ బ్రిడ్జెస్ నిర్మించడం మంచిదని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న భవానీ ద్వీపానికి రెండు కిలోమీటర్ల పై ఎత్తున వంతెనల నిర్మాణం అనువుగా ఉంటుందని సీఆర్‌డీఏ, జల వనరుల శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా వీటిని నిర్మించాల్సి ఉన్నందున నదికి రెండు వైపులా ఉన్న నేల స్వభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేయాలని సర్కారు భావిస్తోంది.
కృష్ణా జిల్లాలోని ఉత్తరపు ఒడ్డున ఉన్న నేల స్వభావం వంతెన నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ, గుంటూరు జిల్లాలోని ఒడ్డున ఉన్న నేల మెత్తగా ఉంది. ఈ నేపథ్యంలో గట్టిగా ఉండే అనువైన ప్రదేశం కోసం ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు.
పియర్స్ లేకుండా వంతెన లట...
కృష్ణానదిపై రెండు వరసల్లో రెండు వంతెనలు నిర్మించనున్నారు. ఒక్కో వంతెన 3 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. వంతెనపై రోడ్డుకు ఇరువైపులా పాదచారులు, సైక్లిస్టులు వెళ్లేందుకు వీలుగా ఫుట్, సైకిల్ పాత్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా సింగపూర్, ఇస్తాంబుల్, టర్కీ ప్రాంతాల్లోని వంతెనలపై ఉన్న మాదిరి గ్రీనరీని అభివృద్ధి చేయనున్నామని గొప్పగా చెబుతున్నారు. నదిమధ్యలో పియర్స్ లేకుండా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిపుణులు యోచిస్తున్నారు.
ఇందుకోసం అత్యాధునిక విదేశీ టెక్నాలజీని అధ్యయనం చేస్తున్నారు. నదిలో నావిగేషన్ సక్రమంగా జరగాలంటే పియర్స్ ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో భద్రత, నిర్మాణ సామర్థ్యం, వ్యయం తదితర అంశాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. నదిలోని ఇసుక, పూడిక మట్టిని డ్రెడ్జింగ్ చేయడం ద్వారా నదికి రెండు వైపులా ఉన్న కరకట్టల ఎత్తును రెండు మీటర్ల వరకూ పెంచనున్నారు. అంతేకాకుండా భవానీ ద్వీపం పక్కనే ఉన్న మరో చిన్న ద్వీపాన్ని మీటరు ఎత్తున పెంచి అక్కడ గోల్ఫ్‌కోర్టు, రిసార్టులు నిర్మించాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది.