5లోపు స్పందించండి
* జీవోఎం విధివిధానాలపై అభిప్రాయాలు చెప్పండి
* రాష్ట్రంలోని 8 పార్టీలకు హోం శాఖ లేఖలు
* అవి స్పందించిన తర్వాతే అఖిలపక్ష సమావేశం
* అనంతరం ఇరు ప్రాంత ఎంపీలతో ప్రత్యేక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధివిధానాలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలను కేంద్ర హోం శాఖ కోరింది. వాటిపై నవంబర్ 5లోగా సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, మజ్లిస్‌లకు లేఖలు రాసింది. జీవోఎం విధివిధానాల ప్రతిని లేఖకు జత చేసింది. అక్టోబర్ 30వ తేదీ వేసి ఉన్న రెండు పేజీల లేఖ పలు పార్టీల కార్యాలయాలకు గురువారం ఫ్యాక్స్ ద్వారా అందింది. లేఖను పార్టీలకు పోస్టు ద్వారా కూడా పంపుతామని హోం శాఖ వర్గాలు తెలిపాయి.
నవంబర్ 7న జీవోఎం మూడో భేటీ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన విధివిధానాలపై అభిప్రాయాలు వెల్లడించడానికి పార్టీలకు నవంబర్ 5 వరకు గడువిచ్చారు. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలనే అంశంపై పార్టీలన్నీ అభిప్రాయం వెల్లడించాక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు.
‘అఖిలపక్షం తేదీని ఇంకా ఖరారు చేయలేదు. దాన్ని ఎప్పుడు నిర్వహించేదీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్నాక ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటూ రాష్ట్రపతికి, ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలపై స్పందించేందుకు షిండే నిరాకరించారు. కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. ‘అఖిలపక్షం తేదీని ఖరారు చేయలేదు. ఎప్పుడు నిర్వహించేదీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్నాక ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.
విభజన ప్రక్రియ రాజ్యంగబద్ధంగా జరుగడం లేదంటూ రాష్ట్రపతికి, ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలపై స్పందించేందుకు షిండే నిరాకరించారు. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆయనను కలిశారు. ఆలస్యానికి తావు లేకుండా విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేలా చూడాలని కోరారు.
ఎంపీలతోనూ ప్రత్యేక సమావేశం
జీవోఎం విధివిధానాలపై అఖిల పక్షం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఎంపీల నుంచి అభిప్రాయం సేకరించాలని హోం శాఖ యోచిస్తోంది. అఖిలపక్షం తర్వాత ఒకట్రెండు రోజుల్లో వారితో సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. గురువారం తనను కలిసిన పలువురు ఎంపీల వద్ద షిండే ఈ మేరకు ప్రస్తావన చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మత్రులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు కూడా షిండే తెలిపినట్టు సమాచారం. తెలంగాణ ఎంపీలు ఒకరిద్దరు దీనికి అభ్యంతరం చెప్పారు. ‘‘కేంద్ర మంత్రుల్లో మా ప్రాంత ప్రాతినిధ్యం కేవలం మూడే. సీమాంధ్ర నుంచి 10 మంది ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులతో కాకుండా ఇరు ప్రాంతాల ఎంపీలు, మంత్రులతో కలిపి సమావేశం నిర్వహించండి’’ అని కోరారు.
అందుకు షిండే సానుకూలత వ్యక్తం చేసినట్టు వారు చెబుతున్నారు.
నివేదిక ఇచ్చిన సీపీఐ: సీపీఐ ఇప్పటికే ఢిల్లీలో షిండేను కలిసి తమ నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. సీపీఎం ఎలాంటి నివేదికా ఇవ్వకూడదని నిర్ణయించగా బీజేపీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే సీమాంధ్ర బీజేపీ నేతలు బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి నివేదికను అందజేశారు. తెలంగాణ నేతలు శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ఇరు ప్రాంతాల నివేదికలనూ పరిశీలించాక పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.
రాజ్యాంగ పరిధికి లోబడే విభజన: షిండే
రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతున్న తీరు, అనుసరిస్తున్న విధానంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం వివరణ ఇచ్చారు. ప్రణబ్‌తో ఆయన గంటకు పైగా భేటీ అయ్యారు. బుధవారం కూడా ఆయన రాష్ట్రపతిని కలవడం తెలిసిందే. విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కిరణ్ లేఖలు రాయడమే గాక విభజన ప్రక్రియ తీరుపై రాష్ట్రపతికి పెద్ద సంఖ్యలో ఇ-మెయిల్స్, వినతులు, ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియ సాగుతున్న తీరును రాష్ట్రపతికి షిండే వివరించినట్టు తెలిసింది. రాజ్యంగ పరిధిలో, న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ముందుకెళుతున్నామని చెప్పారంటున్నారు.
చట్టసభల సంప్రదాయాన్ని పాటించే అంశంపై రాష్ట్రపతి ఆరా తీశారని సమాచారం. ‘విభజన తీర్మానాన్ని అసెంబ్లీకి పంపే అవకాశం లేదు. బిల్లును మాత్రం అసెంబ్లీ అభిప్రాయం కోరే నిమిత్తం పంపిస్తాం’ అని ఆయనకు షిండే తెలిపారంటున్నారు. నవంబర్ 5న ప్రణబ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిరణ్ సహా పలు పార్టీల పెద్దలు ఆయన్ను కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన షిండేను పిలిచి విభజన ప్రక్రియపై వివరణ తీసుకున్నారని హోం శాఖ వర్గాలంటున్నాయి.
పార్టీలకు హోం శాఖ లేఖ సారాంశం...
‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి నూతన రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఈ అక్టోబర్ 3న నిర్ణయం తీసుకోవడం మీకు తెలిసిందే. విభజనకు సంబంధించి వివిధ అంశాలపై సిఫార్సులు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది. అన్ని భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలను ఇ-మెయిల్ లేదా పోస్టు ద్వారా స్వీకరించాలని జీవోఎం నిర్ణయించింది. నియమ నిబంధనలు, షరతుల మేరకు పలు అంశాలకు సంబంధించి మీ పార్టీ సూచనలను జీవోఎంకు తెలియజేయవచ్చు. వాటిని నవంబర్ 5లోగా రాతపూర్వకంగా నాకు పంపవచ్చు. వాటిని స్వీకరించాక మీ పార్టీ ప్రతినిధులతో జీవోఎం చర్చిస్తుంది. దానికి సంబంధించిన తేదీ, సమయం తదితర వివరాలను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది’’