సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్ర హోం శాఖ విధించిన గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తమ విజ్ఞప్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం స్పందించాయని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. విభజనపై ఏర్పాటైన జీవోఎంను వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్సార్‌సీపీ లేఖ రాసిందని, మిగతా 4 పార్టీలు తమ విధానాలకు అనుగుణంగా స్పందించాయని వివరించాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీల నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొన్నాయి.
బీజేపీ మాత్రం నివేదికల సమర్పణకు మరో రెండు రోజుల గడువు కోరిందని వెల్లడించాయి. విభజన విధి విధానాలపై హోం శాఖకు 20 వేలకు పైగా ఇ-మెయిళ్లు అందినట్టు తెలుస్తోంది. ప్రజా సంఘాలు, ఉద్యోగల సంఘాలు, పార్టీల నేతలు విడిగా పంపిన మెయిళ్లను బుధవారం పరిశీలించనున్నారు. వీటన్నింటినీ అంశాలవారీగా విభజించి గురువారం సాయంత్రం జరిగే జీవోఎం భేటీకి సమర్పించే అవకాశముంది. విభజనానంతరం ఇరు రాష్ట్రాల్లో శాంతిభద్రతల అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సోమవారం రాత్రే హోం శాఖకు నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. జీవోఎం గురువారం సాయంత్రం ఇక్కడ హోం శాఖ కార్యాలయంలో మూడోసారి భేటీ కానుంది. పార్టీల స్పందనతో పాటు, పలు వర్గాల నుంచి వచ్చిన సలహాలపై చర్చించనుంది. రాష్ట్ర పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించడమా, లేక విడి విడిగా మాట్లాడటమా అన్నదానిపై కూడా ఈ భేటీలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఎంసీహెచ్ పరిధికే ‘ఉమ్మడి’: గుత్తా
హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ ప్రాంతాన్ని మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి జీవోఎంకు లేఖ రాశారు. తె లంగాణలో విద్యుత్ కొరత తీవ్రత దృష్ట్యా శంకర్‌పల్లి పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు జరిపేలా చూడాలని, కొత్త థర్మల్ విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీభవన్‌ను తెలంగాణకే అప్పగించాలని కోరారు.
జీవోఎంకు సలహాలు సూచనలకు ముగిసిన గడువు
Published Wed, Nov 6 2013 1:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement