ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విడదీస్తున్నారు: మైసూరా
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో వైఎస్ఆర్ సిపి నేతలు ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తొలి నుంచి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న వైఎస్‌ఆర్ సిపి విభజనకు వ్యతిరేకంగా తన వాదన వినిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎదురయ్యే సమస్యలను జీవోఎం దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్ఆర్ సిపి తరపున మైసురారెడ్డి, గట్టు రామచంద్రరావు జీవోఎంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
భేటీ అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీసేటప్పుడు చేయాల్సిన ఆలోచనలు చేయటం లేదన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో విభజన వాదాలు ఉన్నాయని అయితే వాటి గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఎందుకు విడదీయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రాల విభజనపై ఓ కమిషన్ లేదా కమిటీ వేసి విభజనపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఓట్లు.... సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత బాధపడతారో ఆలోచించాలని ఆయన అన్నారు.