వర్సిటీలకు కొత్త చట్టం
15 రోజుల్లో రూపకల్పన.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త చట్టం తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో చర్చించారు. వర్సిటీలకు చాన్సలర్ల నియామకానికి తోడు రాష్ట్రానికి అనుగుణమైన మార్పులు, చేర్పులతో ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఆయనకు తెలిపారు. దీంతోపాటు ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, పదో షెడ్యూల్‌లోని సంస్థల అంశంలో ఏపీ ఫిర్యాదులపైనా వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటికీ గవర్నర్ గౌరవ హోదాలో చాన్సలర్‌గా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక వర్సిటీలకు వైస్ చాన్సలర్ల (వీసీల) నియామకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
ఈ క్రమంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక నిపుణుడిని చాన్సలర్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చాల్సి ఉంది. దీంతోపాటు పాలన, అకడమిక్ వ్యవహారాల్లో ఒక్కో వర్సిటీ ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం, ప్రభుత్వానికి వర్సిటీలపై ఆజమాయిషీ లేకుండా పోయిన పరిస్థితులను చక్కదిద్దాలన్న భావనకు వచ్చారు. వీటన్నింటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కొత ్త చట్టానికి రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, న్యాయశాఖ అధికారులు చర్చించారు. 15 రోజుల్లో చట్టాన్ని రూపొందించాలని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ భేటీ సందర్భంగా గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. దీంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో అడ్మిషన్లు, తదితర వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నమే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... వీటిపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
ఈ సంస్థలన్నీ విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్‌లో ఉన్నాయని, వాటి సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం రాత పూర్వకంగా కోరాల్సి ఉందని, అందుకు అవసరమైన చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత అంశంపైనా గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. చారిత్రక కట్టడమైనప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే స్థితిలో ఉందని, అందుకే కూల్చివేయాలనే నిర్ణయించామని.. అదే స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా ఆయనకు తెలియబరిచారు.
7న ఢిల్లీకి గవర్నర్..
ఈనెల 7న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న పలు అంశాలను సైతం గవర్నర్‌కు కేసీఆర్ నివేదించారు. ప్రధానంగా హైకోర్టు విభజనను వేగంగా పూర్తి చేయాలని కోరారు.