'గీతే.. మా అమ్మాయి సవిత'
లక్నో: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం స్వదేశం తిరిగొచ్చిన గీత.. ఇక తల్లిదండ్రులు ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. గీత తమ అమ్మాయే అంటూ గతంలో నాలుగు కుటుంబాలు ముందుకురాగా.. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ జంట తమ కూతురేనని చెబుతున్నారు.
ప్రతాప్గఢ్ జిల్లా మహేష్గంజ్కు చెందిన రామ్రాజ్ గౌతమ్, అనరా దేవి.. గీత తమ అమ్మాయేననంటూ అలహాబాద్ డివిజనల్ కమిషనర్ రాజన్ శుక్లాను ఆశ్రయించారు. దీన్ని నిరూపించేందుకు విచారణకు, అవసరమైన పరీక్షలకు సిద్ధమని చెప్పారు. వీరికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిందిగా శుక్లా ఆదేశించారు. గీతను చూసేందుకు రామ్రాజ్ దంపతులు ఢిల్లీ వెళ్లారు. గీతే తమ కూతురు 'సవిత' అని, 11 ఏళ్ల కిందట తప్పిపోయిందని చెబుతూ పాత ఫొటోలను చూపించారు.
ఇంతకుముందు తెలంగాణ, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్కు చెందిన నాలుగు కుటుంబాల వారు గీత తమ అమ్మాయే అని చెప్పారు. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్థాన్ సరిహద్దులు దాటింది. సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం గీతను భారత్కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే గీత.. తల్లిదండ్రులమని చెప్పిన బిహార్కు చెందిన మహతోస్ దంపతులను గుర్తించలేకపోయింది. వీరికీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.