లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు రక్తంతో ఉత్తరం రాసింది. తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని అఖిలేష్ను కోరింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విన్నవించింది.
బులంద్షార్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. మగసంతానానికి జన్మనివ్వలేదనే కారణంతో తమ కళ్లెదుటే తన తల్లిని సజీవదహనం చేశారని పెద్ద కుమార్తె లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. 'బేటీ బచావో, బేటీ పదావో (బాలికను రక్షించండి, విద్యావంతురాలిని చేయండి) అని మీరు చెబుతారు. అయితే మీ ప్రాంతంలో ఓ మహిళ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఆమెకు నిప్పుపెట్టిచంపారు. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు మాకు ఎలాంటి సాయం చేయకపోగా, నిందితులను రక్షిస్తున్నారు. మానాన్న మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబ సభ్యులు మా అమ్మను చంపారు. నన్ను, నా చెల్లిని గదిలో బంధించి మా అమ్మకు నిప్పంటించారు' అని సీఎంకు రాసిన లేఖలో ఆ అమ్మాయి పేర్కొంది. కాగా ఈ అమ్మాయి ఇంతకుముందు జూలైలో ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదు. దీంతో రక్తంతో రాస్తే తన పరిస్థితిని ముఖ్యమంత్రి అర్థం చేసుకుని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరోసారి లేఖ పంపినట్టు చెప్పింది. మొదట ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ ఉత్తరాన్ని తర్వాత ఫ్యాక్స్ ద్వారా సీఎంకు పంపింది.
మహిళను చంపిన మరుసటి రోజే పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినా వారిని అరెస్ట్ చేయలేదని బాధిత మహిళ కుమార్తె ఆరోపించింది. పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఆధారాలు లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని బులంద్షార్ సీనియర్ ఎస్పీ అనీస్ అన్సారీ చెప్పారు.
సీఎంకు రక్తంతో ఉత్తరం రాసిన అమ్మాయి
Published Fri, Aug 12 2016 2:57 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM
Advertisement
Advertisement