అఖిలేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ
- ‘17 బీసీ ఉపకులాలకు ఎస్సీ హోదా’ ఉత్తర్వులపై స్టే
- ఎన్నికల వేళ సంచలనంగా మారిన అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నవేళ ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్ యాదవ్ సర్కారుకు ఎదురుదెబ్బతగిలింది. 17 వెనుకబడిన తరగతి ఉప కులాను షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) కేటగిరీలో చేర్చుతూ గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. దీంతో బీసీలను ఆకట్టుకోవాలనుకున్న అఖిలేశ్ ప్రయత్నాలకు గండిపడినట్లైంది.
సీఎం అఖిలేశ్ అధ్యక్షతన డిసెంబర్ 22న హడావిడిగా సమావేశమైన యూపీ కేబినెట్.. అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలను ఎస్సీల్లో చేర్చాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కొద్ది గంటల్లోనే జీవో కూడా జారీ అయింది. కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, భర్, ప్రజాపతి, బథం, గౌర్, తురా, మాఝీ, మలా, కుమ్హార్, ధీమర్, మచువా తదితర కులాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్దిచేకూరినట్లైంది. అయితే సరిగ్గా నెల రోజులకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
యూపీ ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనం రిపోర్టు మేరకు కులాల విలీనానికి సంబంధించిన తీర్మానాన్ని 2013లోనే అసెంబ్లీ ఆమోదించింది. కానీ, జీవో మాత్రం సరిగ్గా ఎన్నికల ముందు విడుదలైంది. దీంతో విపక్ష బీఎస్పీ సహా ఇతర పార్టీలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. విచిత్రం ఏమంటే, 2004లోనూ నాటి సీఎం ములాయం ఇవే బీసీ ఉప కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేర్చేందుకు జీవోను జారీచేశారు. అప్పుడు కూడా హైకోర్టు జోక్యంతోనే ఆ ఆదేశాలు చెల్లుబాటుకాలేదు.