భరించలేను.. గుండె బద్దలవుతోంది..
న్యూఢిల్లీ: ‘ప్రతిమనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. నా సహనానికి కూడా ఒక హద్దుంది. ముఖ్యమంత్రి, ఆయన మనుషులు ఆ పరిధి దాటి నన్ను నిందిస్తున్నారు. వాళ్ల మాటలు నన్ను తీవ్రంగా కుంగదీస్తున్నాయి. గుండె బద్దలవుతోంది. ఇక భరించలేను. పెద్దాయనే నాకు దిక్కు. ఆయనకే నా బాధ చెప్పుకుంటా. నిజానికి నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)తో బాబు(సీఎం అఖిలేశ్ యాదవ్) గురించి ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్‌గానే తప్ప నెగటివ్‌గా మాట్లాడను. ఈ విషయంలో వాళ్ల(అఖిలేశ్ వర్గం) విమర్శలు భరించలేకపోతున్నా’అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ మీడియాతో తన గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ మేరకు ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన అమర్ సింగ్.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ములాయం సింగ్ నివాసానికి వెళ్లి గంటలపాటు చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీలో కొద్ది రోజుల కిందట తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు.. ములాయం జోక్యంతో సద్దుమణిగినట్లయ్యాయి. కానీ వైరిపక్షాలు వీలుచిక్కినప్పుడల్లా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూనేఉన్నారు. అమర్ సింగ్‌కు వ్యతిరేకంగా సీఎం అఖిలేశ్ వర్గీయులు మాటలదాడిని తీవ్రతరం చేశారు. దీంతో అమర్.. నేతాజీని వ్యక్తిగతంగా కీలక చర్చలు జరిపారు.
‘ముఖ్యమంత్రి అఖిలేశ్తోనే నాకు గొడవ. అదే ములాయం కొడుకుగా మాత్రం అఖిలేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. వాస్తవంగా అతనికి సంబంధంచి మేలుచేసే సలహాలే ఇస్తుంటా. ఎందుకోగానీ వాళ్లకు ఆ విషయం అర్థంకాదు. నేతాజీ నన్ను అర్థం చేసుకున్నారు. అందుకే బహిరంగవేదికలపైనా నన్ను సమర్థిస్తారు. ఏది ఏమైనా నేను ములాయం నమ్మినబంటును. నా బాధ చెప్పుకుంటా. చివరికి ఆయన ఆదేశాలనే శిరసావహిస్తా’అని అమర్‌సింగ్ అన్నారు.