
వాళ్లు మళ్లీ కలిసి షాకివ్వనున్నారా!
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పొత్తు లేకుండానే గత ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సమాజ్ వాది పార్టీ మరోసారి అదే విజయాన్ని దక్కించుకునేందుకు పొత్తులకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీతో.. ఈ ఊహగానాలకు బలాన్నిచ్చేట్లుగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రాహుల్ మంచి వాడని, అవసరం అయితే, తాము స్నేహాన్ని ఒకరికొకరం పంచుకుంటామని అన్నారు.
ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 2,500 కిలోమీటర్లు యాత్రను రాహుల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఖిలేశ్ 'రాహుల్ మంచి మనిషి.. మంచి బాలుడు. అతడు ఎక్కువకాలంపాటు యూపీలోనే గడిపితే మాకు అతడితో స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు మంచి వ్యక్తులు మరోసారి కలుసుకుంటే అందులో తప్పేముంది' అంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించి అవాక్కయ్యేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, సమాజ్ వాది పార్టీకి గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి. కేంద్రంలో కూడా ములాయం పలుమార్లు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. కాగా, అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కాంగ్రెస్తో ఎస్పీ పొత్తుపెట్టుకుంటుందా అని మీడియా ప్రశ్నించగా ప్రతి విషయాన్ని అలా రాజకీయ కోణంలోనే ఎందుకు చూస్తారు అని సమాధానం దాట వేశారు.