ఆ గ్యాంగ్‌రేప్ వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర!
- ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: తల్లీకూతుళ్లపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను రాజకీయంగా కుదిపేస్తున్నది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ అమానుష ఘటన చుట్టూ సహజంగానే రాజకీయాలు తిరుగుతున్నాయి.
గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేతల బృందం బులంద్‌షెహర్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వచ్చింది. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో అఖిలేశ్ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
అయితే, ఈ ఘటనపై యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ వెంటనే తిప్పికొట్టింది. కనీస మానవత్వముంటే ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపాలని కోరారు.