యూపీఏ పాలకులపై వినోద్ రాయ్ పిడుగు
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిని ప్రతిపక్ష హోదా దక్కపోవడంతో దిగాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ యూపీఏ పాలకుల బండారం బయటపెట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. కోల్ గేట్, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాల నుంచి పలువురు పేర్లు తప్పించాలని యూపీఏ పాలకులు కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని వినోద్ రాయ్ వెల్లడించారు.
'కొందరు రాజకీయ నాయకులు మా ఇంటికి వచ్చి కోల్ గేట్, కామన్వెల్త్ కుంభకోణాల్లో సంబంధమున్న వారి పేర్లు కాగ్ నివేదిక తొలగించాలని నాపై ఒత్తిడి తెచ్చారు' అని వినోద్ రాయ్ చెప్పారు. ఆయన రాసిన 'నాట్ జస్ట్ యాన్ ఎకౌంటెంట్' పుస్తకంలో తాజా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా ఆయన టార్గెట్ చేశారు. బాధ్యతల నుంచి మన్మోహన్ సింగ్ పారిపోయారని ఆక్షేపించారు. సంజయ్ బారు, పీసీ పరేఖ్ కూడా మన్మోహన్ సింగ్ నిష్క్రియను వెల్లడించిన సంగతి తెలిసిందే.