మన్మోహన్‌సింగ్ తప్పు చేశారు!
2జీ అవకతవకలపై నాటి ప్రధానికి లేఖ రాశానన్న కమల్‌నాథ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రతిపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి, అదీ తన మంత్రివర్గ సహచరుడి నుంచి కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలపై నాటి ప్రధాని మన్మోహన్‌ను హెచ్చరిస్తూ తానో లేఖ రాశానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మాజీమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం వెల్లడించారు. తన లేఖను పట్టించుకోకుండా మన్మోహన్‌సింగ్ తప్పు చేశారన్నారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణల వెనుక రాజకీయ ప్రేరేపణలున్నాయని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో ప్రధాని పేరును ప్రస్తావించకుండా కొందరు ఒత్తిడి చేశారన్న వినోద్ రాయ్.. అప్పుడే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు.
సీరియస్‌గా తీసుకోవాల్సిందే: బీజేపీ
బొగ్గు, 2జీ కుంభకోణాల్లో మాజీ ప్రధానమంత్రి పాత్రపై మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని శుక్రవారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. యూపీఏ, కాంగ్రెస్‌లు దేశాన్ని అడ్డంగా దోచుకున్నాయని ఆరోపించారు. రాయ్ ఆరోపణలపై కాంగ్రెస్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. తనకేమీ తెలియదని ప్రధాని తప్పించుకోలేరన్నారు.
సీబీఐకి స్వతంత్రత లేదు
పోలీసు ఆధిపత్యం ఉన్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎన్నికల సంఘం, కాగ్ మాదిరిగా స్వతంత్రంగా వ్యవహరించలేదని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ప్రత్యక్ష నియంత్రణ లో సీబీఐ ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐని విమర్శించినవారు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ నియంత్రణ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు.