
ఆకాంక్షలు నెరవేర్చేలా అక్షరయజ్ఞం
అవసరమైతే మరో ఉద్యమానికి వెనుకాడకూడదు
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరావు
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా తెలంగాణ రచయితలు అక్షర యజ్ఞాన్ని సాగిస్తారని, అవసరమైతే మరో ఉద్యమానికి వెనుకాడబోరని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేసిన ‘వర్తమాన సాహిత్యం-ధోరణులు-కర్తవ్యాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు నడిపించాలని, కానీ ప్రస్తుతం సమాజంలో ఏదో స్తబ్దత, అస్పష్టత నెలకొన్నట్లు కనబడుతోందన్నారు. తెలంగాణ పీఠంలో అక్షరాల పాత్ర ఎంతో ఉందని, ప్రభుత్వం మాదీ అని చెప్పుకోవడానికి రచయితలకు హక్కు ఉందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజావ్యతిరేకులా? ప్రశంసిస్తే మిత్రులా? అంటూ కొందరు రచయితలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితల పాత్ర మరువలేనిదని చెప్పారు.
రాష్ట్రంలో స్వేచ్ఛగా, భయం లేకుండా ఉన్నామా? అనేది ఆలోచిస్తే ప్రజాస్వామ్య స్వేచ్ఛ అమలు కావడంలేదన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక రకమైన అణచివేత కొనసాగితే.. తెలంగాణ రాష్ట్రంలో మరో తరహాలో అణచివేత కొనసాగుతోందన్నారు. ఈ సదస్సులో ప్రముఖ రచయితలు, కవులు అంద్శై గోరటి వెంకన్న, ఎం.వేదకుమార్, జింబో, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు.
సెప్టెంబర్‌లో సాహితీ జాతర
సెప్టెంబర్‌లో తెలంగాణ సాహితీ జాతరను మెదక్ జిల్లాలో నిర్వహించాలని తెలంగాణ రచయితల వేదిక నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి, జిల్లా కార్యవర్గ సమావేశాల తీర్మానాలను వేదిక రాష్ట్ర కార్యదర్శి గాజుల నాగభూషణంతో కలసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించినా సాహితీ సంబరాలకు చోటు లభించలేదని, అందువల్లే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణలోని పది జిల్లాల రచయితలు, కవులు, కళాకారులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణలో కవులు, రచయితల సహకార సంఘం ఏర్పాటు చేయాలని, దీనికి తక్షణమే రూ.5 కోట్లు మంజూరు చేయాలని తిరుమలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి వివిధ భాషల్లోకి తెలంగాణ సాహిత్యాన్ని అనువదింపజేసి ముద్రించాలని కోరారు. మలిదశ తెలంగాణ పోరాటంలో ఎక్కువ ప్రచారం పొందిన గీతాన్ని వెంటనే రాష్ట్ర గీతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.