యాసిడ్ నీటిలో పడి కరిగిపోయాడు
అగ్నిపర్వతాలకు చేరువలో ప్రవహిస్తున్న నీటిలో పడి ఓ యువకుడు కరిగిపోయిన..
అగ్నిపర్వతాలకు చేరువలో ప్రవహిస్తున్న నీటిలో పడి ఓ యువకుడు కరిగిపోయిన దారుణ సంఘటన అమెరికాలోని వ్యోమింగ్ లో గల ఎల్లోస్టోన్ జాతీయ ఉద్యానవనంలో చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ లో దుర్ఘటన జరిగినా మీడియా దృష్టికి రాలేదు. అక్కడి మీడియా సంస్ధలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓరేగాన్ కు చెందిన కొలిన్ నాథనీల్ స్కాట్, అతని సోదరి(పేరు చెప్పలేదు) విహారయాత్రకు ఎల్లోస్టోన్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లారు.
అగ్నిపర్వతాల ప్రభావం వల్ల అసాధారణ వేడితో ప్రవహించే నీటి కుంటలను చూడాలనే ఆసక్తితో అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఓ వేడి నీటి కుంట వద్దకు వెళ్లి అక్కడ ఎంత వేడి ఉందో తెలుసుకోవడానికి స్కాట్ ప్రయత్నించగా జారీ అందులో పడిపోయినట్లు మీడియా సంస్ధలు పేర్కొన్నాయి. దీంతో అతని సోదరి పార్కు సిబ్బందిని సంప్రదించగా సహాయక బృందం అక్కడికి చేరుకునే లోపే మరణించాడని చెప్పాయి.
వేడి నీటి కుంట వద్ద అసాధారణ రీతిలో ఉష్ణోగ్రత ఉండటంతో స్కాట్ శరీరాన్ని కూడా సహాయక బృందం బయటకు తీయలేకపోయాయని తెలిపాయి. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా కుంటలోని స్కాట్ శరీరం మాయమైందని చెప్పాయి. దీనిపై స్పందించిన పార్కు సిబ్బంది నీటిపై భాగంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారవుతుందని చెప్పారు. యాసిడ్ వల్లే స్కాట్ శరీరం నీటిలో కరిగిపోయిందని వెల్లడించారు.
భూగర్భంలో ఉన్న రాళ్లు, మట్టిలో గల హైడ్రోజన్ సల్ఫైడ్ ను నీరు తాకినప్పుడు సల్ఫూరిక్ యాసిడ్ తయారవుతుందని తెలిపారు. ఆ తర్వాత భూమి పైభాగానికి వచ్చిన నీరు దగ్గరలోని అగ్నిపర్వత వేడికి ప్రభావితమైన అత్యధిక ఉష్ణోగ్రతతో ప్రవహిస్తుంటుందని పేర్కొన్నారు. కాగా, స్కాట్ నీటిలో పడిన సంఘటనను మొత్తం అతని సోదరి మొబైల్ లో చిత్రీకరించింది. ఈ వీడియోను బయటకు విడుదల చేసేందుకు పార్కు అధికారులు ఒప్పుకోలేదు.