ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది. (ఇన్ సెట్లో) యాత్రలో చిక్కుకున్న కదిరివాసులు బాలాజి, సుప్రజ,వారి కుమార
పలుచోట్ల కూలిన వంతెనలు, దెబ్బతిన్న రోడ్లు
* చార్‌ధామ్ యాత్రికులకు ఇబ్బందులు
* వరదల్లో చిక్కుకుపోయిన ‘అనంత’వాసులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్ లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రాకేశ్ శర్మ కేదార్‌నాథ్, బద్రీనాథ్ సమీపప్రాంతాలను సందర్శించారు. కేదార్‌నాథ్‌లో యాత్రికులు ఎవరూ లేరని, వారందరినీ సోన్‌ప్రయాగ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. బద్రీనాథ్, హేమ్‌కుండ్‌లకు వెళ్తూ చిక్కుకున్న వారిని రక్షించేందుకు శనివారం కూడా హెలీకాప్టర్లను వినియోగిస్తామని చెప్పారు. తరలింపు చర్యలు సాగుతున్నా ఈ ప్రాంతాల్లో సుమారు 9 వేల మంది చిక్కుకుపోయారని చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు. కాగా, నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పశ్చిమ రాజస్థాన్‌కు కూడా చేరుకోవడంతో రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
‘అనంత’వాసుల కష్టాలు
చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లా వాసులు వర్షాల్లో చిక్కుకుపోయారు. వీరిలో అనంతపురం, కర్ణాటకకు చెందిన వారు 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఈ నెల 15, 18 తేదీల్లో యాత్రకు వెళ్లారు. బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన కొందరిని జోషి మఠానికి తరలించారు. కాగా, చార్‌ధామ్ యాత్రలో తన కుమారుడు, కోడలు, మనవళ్లు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం విని అనంతపురంలోని జీసస్‌నగర్‌కు చెందిన కుళ్లాయప్ప గుండెపోటుతో మృతి చెందారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు.