ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ మళ్లీ వణికిపోతోంది. గత అనుభవాలను గుర్తు తెచ్చుకొని జడుసుకుంటోంది. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో సంభవించిన వరద ఉత్పాతం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో ఇప్పటికీ మరిచిపోలేని ఉత్తరాఖండ్ వాసులు మళ్లీ భారీ వర్షాలు, వరదలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్ సహా వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జల మయం కాగా జనజీవనం అస్తవ్యస్తమయింది.
మరోవైపు భారీ వర్షాలు, వరదలు పవిత్ర ఛార్‌ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. విస్తారంగా పడుతున్న వానలతో యాత్రా మార్గంలో ప్రయాణానికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు పలు రహదారుల్లో కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఫలితంగా యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. జోషీమఠ్, హేమ్ కుంద్‌సాహిబ్ సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించడానికి వైమానిక దళం రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక విమానంలో జోషీమఠ్, హేమ్ కుంద్‌సాహిబ్‌లకు తరలి వెళ్లాయి.
మరోవైపు కేదారీనాధ్ వద్ద యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న మందాకినీ నది కేదారీనాధ్‌కు వెళ్లే మార్గంలోని వంతెన ధ్వంసం చేసింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోని సోన్ ప్రయాగ్, గౌరీ కుంద్ మధ్యలో ఉన్న విఠల్ బ్రిడ్జ్ భారీ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఫలితంగా కేదారీనాధ్ వద్ద ఉన్న యాత్రికులు అక్కడే ఉండిపోయారని తెలుస్తోంది. దాదాపు 400 మంది యాత్రికులు కేదారీనాధ్ వద్ద చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారిని సురక్షితంగా తీసుకురావడానికి వైమానిక దళం చర్యలు చేపట్టింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్లో అలకనందా నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుంది.