
‘ఓం’ ఉచ్చరించినా వివాదమే!
ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశంలో ‘ఓం’ ఉచ్చారణతో వివాదాలు తలెత్తగలవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ఆయన సోమవారం ఢిల్లీలో ఆవిష్కరిస్తూ.. ఈ పురాణంపైనా వివాదం వస్తుందేమోనన్నారు. ‘మన దేశంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైద్ధాంతిక ప్రాతిపదికపైనా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ‘ఓం’ అంటే.. ‘ఓం’ ఎలా అంటారని వారం రోజుల పాటు వివాదం రేగుతుంది’ అని అన్నారు.
‘ఇటువంటి దేశంలో రామచరితమానస్‌ను ఎవరూ ప్రశ్నించలేదు. అది ఇప్పుడూ నడుస్తోంది. ఈ రోజు తర్వాత దీనిపై ఎవరో ఒకరి దృష్టిపడి.. తుపాను సృష్టిస్తారేమో.. నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. భారత దేశ సారాంశాన్ని అద్భుతంగా తెలిపే ‘రామచరితమానస్’ గొప్ప ఇతిహాసమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో హిందూ మతానికి సంబంధించిన ‘ఓం’ ఉచ్చరించాల్సి వస్తుంది కాబట్టి తాము పాల్గొనలేమని ముస్లిం సంస్థలు పేర్కొనటం, దానిపై వివాదం తలెత్తటం తెలిసిందే.
కాగా, రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషి ని మెదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతోకాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. 20-22 ఏళ్లపాటు రికార్డింగ్ చేశారంటే దీని కోసం ఎంతగా శ్రమించారో అర్థమవుతుందని అన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు.
‘మండలి’లో సంస్కరణలు తక్షణావసరం
ఈ నెల 25న జరిగే ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) 70వ సమావేశంలో.. పెండింగ్‌లో ఉన్న భద్రతామండలి సంస్కరణలు సహా పలు అపరిష్కృత అంశాలపై నిర్ణయాత్మక ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూఎన్‌జీఏ 70వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మెజెన్ లికెటాఫ్ట్‌తో మోదీ సోమవారం భేటీ అయ్యారు. భద్రతామండలిలో సంస్కరణలు తక్షణావసరమని మోజెన్‌తో చెప్పారు.