త్వరలో వసుంధర రాజె అవుట్!
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై వేటువేసేందుకు ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత మోడీకి వీసా ఇప్పించడంలో సహకరించిన వసుంధర రాజెను వారం రోజుల్లోగా తొలగించాల్సిందిగా బీజేపీ నాయకత్వానికి ఆరెస్సెస్ గట్టిగా హెచ్చరించినట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆరెస్సెస్ సీనియర్ నాయకుడొకరు శుక్రవారం మీడియాకు తెలిపారు.
వసుంధర స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఉపాధ్యక్షుడైన ఓం ప్రకాష్ మాథూర్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకుల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదరినట్లు కూడా ఆయన చెప్పారు. వసుంధర రాజె అవినీతికి పాల్పడినట్టుగా భావిస్తున్న ఆరెస్సెస్, లలిత్ మోదీ కేసులోనే ఇరుక్కున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీ విషయంలో భిన్నమైన అభిప్రాయంతో ఉందని ఆ ఆరెస్సెస్ నాయకుడు తెలిపారు. వీరి కేసు వసుంధర రాజె అంత తీవ్రమైనది కాదన్న ఆరెస్సెస్ నాయకత్వం అభిప్రాయమని ఆయన అన్నారు.
ఆరెస్సెస్ హెచ్చరికల మేరకు వసుంధర రాజెను తొలగించేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించిందని, అయితే ఈ విషయంలో నానా యాగీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి, మీడియాలో వస్తున్న కథనాలకు లొంగిపోయి తొలగించారనే అభిప్రాయం ప్రజల్లో కలగరాదనే భావనతో బీజేపీ నాయకత్వం ఉందని విశ్వసనీయ బీజేపీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ అభిప్రాయంతో ఉన్నారని, రాజకీయ పరిస్థితులు చల్లబడ్డాక రాజెపై చర్యతీసుకోవచ్చన్నది ఆయన అభిప్రాయమని ఆ వర్గాలు తెలిపాయి. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా, స్మృతి ఇరానీ, పంకజ ముండేలపై కూడా తాత్కాలికంగానైనా చర్య తీసుకోవాలన్నది నరేంద్ర మోదీ అభిమతంగా బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.