
ప్రశ్నల పేరిట ‘వట్టి’ కోర్కెల చిట్టా!
డిమాండ్లు తీరిస్తే విభజనకు ఓకేనని జీవోఎం ముందు అంగీకారం
తమ వాదనను కోర్కెల చిట్టా అనుకోవచ్చని మీడియాతో వసంత్‌కుమార్ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) ముందు బలంగా వాదనలు వినిపించామని మంత్రి వట్టి వసంత్‌కుమార్ మంగళవారం చెప్పిన మాటలన్నీ నీటిమూటలేనని తేలింది. పీసీసీ తరఫున ప్రత్యేక నివేదికతో జీవోఎం ముందు హాజరైన వట్టి సీమాంధ్ర సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతారని ప్రశ్నిస్తూనే... డిమాండ్ల చిట్టాను జీవోఎం ముందుంచారు. మంగళవారంనాటి జీవోఎం భేటీ వివరాలను, అక్కడ ప్రస్తావించిన అంశాలను ఆయన బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. తమ ప్రాంతానికి అవసరమయ్యే అన్ని ప్రతిపాదనలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నలరూపంలో జీవోఎం ముందుంచినట్టు చెప్పారు.
వీటినే ప్రశ్నలుకానీ, కోర్కెల చిట్టాకానీ.. ఏదైనా అనుకోవచ్చని, వాటికి పరిష్కారం చూపితే విభజనకు తాను అంగీకరిస్తానని తెలిపారు. పీసీసీ ఆదేశించిన మేరకే నివేదికను జీవోఎం ముందుంచానన్నారు. ‘‘విభజనతో అనేక సమస్యలున్నాయి. ఒక సమస్యను పరిష్కరిస్తే మరిన్ని ఉత్పన్నమయ్యే అవకాశముంది. వీటన్నింటికీ కేంద్రమే పరిష్కారం చెప్పాలి. విభజనతో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని చెబుతూనే.. విభజన జరిగితే ఏవిధంగా సాయమందిస్తారో చెప్పాలని కోరా’’ అని తెలిపారు. వట్టి తెలిపిన ప్రకారం ప్రశ్నలరూపంలోని డిమాండ్ల చిట్టా ఇదీ...
హైదరాబాద్‌లో కేంద్ర అధీనంలోని బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, డీఆర్‌డీవో.. తదితర ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. విభజన జరిగితే ఇలాంటివి సీమాంధ్రలో పెట్టగలరా?
1990 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. దీంతో అన్ని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న తరహాలో కొత్తగా ప్రభుత్వరంగ సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేయడం సాధ్యమేనా? సాధ్యం కాకుంటే, సీమాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి తీసుకునే చర్యలేమిటి?
2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి రూ.55 వేల కోట్ల ఆదాయమొస్తే.. అందులో రూ.51 వేల కోట్ల ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరిగాయి. ఇందులో 60 శాతం ఐటీ ఎగుమతులు సీమాంధ్ర నుంచి జరిగేలా హామీ ఇవ్వగలరా?
వ్యవసాయ రంగానికే పరిమితమైన సీమాంధ్ర జిల్లాలను పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చేసేందుకు మీ వద్ద ఉన్న విధానం, ప్రణాళికేంటీ?
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంలో 60 శాతం సీమాంధ్రకిచ్చేలా తెలంగాణ వారిని ఒప్పించగలరా?
ఓ రాష్ట్రంలో ఆదాయాన్ని మరో రాష్ట్రానికి పంచే అవకాశం రాజ్యాంగంలో లేదు. యూటీ చేస్తే తప్ప ఉమ్మడి రాజధానిలో అది సాధ్యంకాదు. యూటీ చేసేందుకు మీరు సిద్ధమేనా?
కొత్త రాజధాని నిర్మాణం, ఐటీ పార్కులు, ఐటీ హబ్స్, వైద్యం, విద్య రంగాల అభివృద్ధికి నిధులు, స్థలాలిస్తారా? ఇందుకు పన్నురాయితీలను 30 ఏళ్లపాటు కొనసాగిస్తారా?
హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సీమాంధ్రుల భద్రత, ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ హెచ్‌ఎండీఏ పరిధిని శాశ్వత యూటీ చేస్తారా?
హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర.. విలీనానికి ముందున్న సరి హద్దులను కొనసాగించగలరా?
నదీజలాలను కింది రాష్ట్రాలకు వదలడంలో ఎగువ రాష్ట్రాలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించట్లేదు. మరి నదీజలాల సమస్యను ఎలా పరిష్కరిస్తారు?