
వైఎస్సార్ సీపీ ఎంపీల వినతిపై వెంకయ్య స్పందన
పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన వినతిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.
ఢిల్లీ: పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన వినతిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. పొగాకు రైతుల సమస్యలపై ఆ బోర్డు చైర్మన్ తో వెంకయ్య ఫోన్ లో మాట్లాడారు. పొగాకు కొనుగోలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు ఆదేశించారు. పొగాకు మద్దతు ధరలో ఎందుకంత వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య ప్రశ్నించారు. తక్షణమే ఐటీసీతో మాట్లాడి పొగాకు రైతులకు ఇచ్చిన ధరలను చెల్లించేలా చూడాలని సూచించారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని శుక్రవారం వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్ లు కలిసి పొగాకు రైతుల సమస్యలను విన్నవించారు. ఇదే అంశంపై గురువారం వైఎస్సార్ సీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, అరుణ్ జైట్లీలను కలిసిన సంగతి తెలిసిందే.