ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు.
యాత్ర చేసి తీరుతామని వీహెచ్పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.
యాత్రను ప్రభుత్వం నిషేధించిందని, అందువల్ల దీనికి బయల్దేరేవాళ్లు ఎవరైనా వారిని అరెస్టు చేస్తామని శాంతి భద్రతల అదనపు డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. వీహెచ్పీ నాయకుడు అశోక్ సింఘాల్ను కూడా అరెస్టు చేస్తారా అని అడగ్గా, ఆయన అయోధ్యకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన్నూ అదుపులోకి తీసుకోక తప్పదని వెల్లడించారు. లేనిపక్షంలో పమాత్రం ఆయన ఎక్కడికైనా వెళ్లచ్చన్నారు.