
షీనా బోరా హత్య కేసులో గ్రామస్తుని సాయం!
ముంబై: షీనా బోరా.. 2012, ఏప్రిల్ నెలలో హత్య గురైంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ కలిసి షీనాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.
అయితే షీనా అవశేషాలను సేకరించే పనిలో పడ్డారు ముంబై పోలీసులు. షీనా హత్య కేసు దర్యాప్తులో సాయం అందించేందుకు రాయ్ గఢ్ జిల్లాలోని పెన్ తెహసిల్ గ్రామనికి చెందిన గణేష్ థానే ముందుకొచ్చాడు. గత మూడు సంవత్సరాల క్రితం ఓ మృతదేహ ఖనన స్థలిని చూశానని పేర్కొన్న గణేష్.. పోలీసులకు సాయం అందించేందుకు సిద్ధమయ్యాడు.
తాను మామిడి కాయలు తేవడానికి అడవికి వెళ్లిన సమయంలో ఓ పాడైన మృతదేహాన్ని అక్కడ చూసినట్లు అతను పోలీసులకు తెలిపాడు. దీంతో అతనితో కలిసి శనివారం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పోలీసులు కొన్ని అవశేషాలను సేకరించారు. తాము సేకరించిన అవశేషాలను డీఎన్ఏ టెస్టుకు పంపిస్తున్నామని ముంబై నగర కమిషనర్ రాకేష్ మారియా తెలిపాడు.
అప్పుడు పట్టించుకోని పోలీసులు..
మూడేళ్ల కిందట రాయ్‌గఢ్ జిల్లా పెన్ తాలూకాలో షీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించి ఎటువంటి హత్య లేదా ప్రమాద మరణం కేసునూ నమోదు చేయకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆనాడు విచారణను ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా 2012లో హత్యకు గురైన విషయం కొద్ది రోజుల కిందటే వెలుగు చూడ్డం తెలిసిందే. '2012 మే 23వ తేదీన సగం కాలి, పాడైపోయివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఒక వ్యక్తి సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తొలుత కొన్ని అవశేషాలను అప్పట్లో సేకరించినా.. వాటిపై దర్యాప్తు మాత్రం జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.