బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
మొహాలీ: తనపై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇండియా- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ కోసం మొహాలీ వచ్చిన కోహ్లీ.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘నిజానికి నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్(మొదటి) టెస్ట్‌లో నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్‌లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని కోహ్లీ మీడియాతో అన్నారు. న్యూస్ పేపర్లో కథనం ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నవంబర్9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థి జట్టు (ఇంగ్లాండ్) ఆటగాళ్లుకానీ, మ్యాచ్ అంపైర్లుగానీ కనీసం ఫిర్యాదు చేయని విషయాన్ని హైలైట్ చేస్తూ బ్రిటీష్ పత్రిక రాసిన కథనాన్ని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా కొందరు మాజీలు ఖండించారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్‌కి పాల్పడినా.. మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే ఫిర్యాదుచేయాల్సి ఉంటుంది.
కాగా, బీసీసీఐ, ఐసీసీల మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో కోహ్లీ బలవుతాడా? అనే అనుమానాలూ లేకపోలేదు. పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్‌లు ఆడని కారణంగా టీమిండియా మహిళా జట్టు పాయింట్లను ఐసీసీ కోత విధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా కోహ్లీ పైనా నిబంధనలకు విరుద్ధంగా ఐసీసీ చర్యలకు దిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అనుమానం.