కలిసిపోయిన అంబానీలు
సోదరుడు ముకేశ్ అంబానీతో ఉన్న విభేదాలను వదిలి బిలియనీర్ అనిల్ అంబానీ(57) ముందడుగు వేశారు. ముకేశ్ తాజా సంచలనం జియోతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో షేర్ హోల్డర్లతో సమావేశమైన అనిల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ధీరూభాయ్ కలలను సాకారం చేసేందుకు తాము ఇద్దరు కలిసి శ్రమిస్తామని పేర్కొన్నారు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4జీ సేవలను మొదలుపెట్టిన మూడు నెలల్లోపు మిలియన్ వినియోగదారులు మార్క్ ను దాటినట్లు వెల్లడించారు. 2జీ, 3జీ, 4జీ సర్వీసులను అందించేందుకు కావలసిన స్పెక్ట్రమ్ తమ వద్ద ఉందని సమావేశంలో అనిల్ పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం.. జియో మొబైల్ స్పెక్ట్రమ్ ను రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ టవర్స్ ను జియో ఇన్ఫోకామ్ లు వినియోగించుకోనున్నాయి. ఈ ఒప్పందంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీగా(స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది)లాభపడనుంది.
వచ్చే ఏడాదిలోపు కంపెనీ పేరిట ఉన్న 75శాతం అప్పులను తీర్చేయాలనే యోచనలో ఉన్నట్లు అనిల్ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఎయిర్ సెల్ తో విలీనం అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారత్ లోని 12 టెలికాం సర్కిల్స్ లో ముందుకు దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ముకేశ్ అంబానీని అనిల్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే.