పరిమళించిన మానవత్వం
సరా లేని చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలు
- ‘రెక్కలు తెగిన పక్షులు’ కథనానికి దేశ విదేశాల నుంచి విశేష స్పందన
- బాధిత కుటుంబం ఇంటికి తరలివచ్చిన మానవతావాదులు
- ఆర్థికసాయం అందజేస్తామని, పిల్లలను చదివిస్తామని హామీ
హైదరాబాద్: మానవత్వం రెక్క తొడిగింది.. ‘రెక్కలు తెగిన పక్షుల’ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.. ఆసరా లేని కుటుంబానికి తామున్నామంటూ భరోసానిచ్చింది. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో అమ్మ ఆత్మహత్య చేసుకోగా, అనారోగ్యంతో నాన్న మంచానికే పరిమితమవగా అనాథలైన ఇద్దరు చిన్నారుల దీనగాథపై ‘రెక్కలు తెగిన పక్షులు’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ విదేశాలలో ఉన్న మానవతా వాదులు, దాతలు విశేషంగా స్పందించారు.
హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ముందుకొచ్చారు. ‘సాక్షి’ వెబ్ పోర్టల్‌లో ఈ కథనాన్ని చదివిన బెంగళూరు, మద్రాసు, ముంబై తదితర ప్రాంతవాసులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, సినీ నిర్మాతలు, స్వచ్ఛంద సంస్థలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వినోద్ కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని, వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పాలని కోరారు. ఇక హైదరాబాద్ నుంచి చాలా మంది నేరుగా రాంనగర్‌లోని వినోద్ నివాసానికి వచ్చి చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ట్రస్టుల యజమానులు, అనాథ ఆశ్రమాలు, పాఠశాలల నిర్వాహకులు పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని, తామే పెంచి పెద్ద చేస్తామని హామీ ఇచ్చారు. పాప పెళ్లి కూడా చేయిస్తామని ఆ తండ్రికి భరోసా ఇచ్చారు.
బ్యాంక్ ఖాతాను ప్రారంభించింది దాతలే..
వినోద్ కుటుంబానికి బ్యాంక్ ఖాతా లేదని తెలియడంతో అడిక్‌మెట్ డివిజన్ బ్రాహ్మణ సేవా సమాఖ్య నాయకులు కౌండిన్య ప్రసాద్, మాధవ్‌లు రాంనగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో చిన్నారి సాయి నిఖిత పేరుతో ఖాతాను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ స్వయంగా ఆ చిన్నారుల ఇంటికి వచ్చి తండ్రి నామినీగా సంతకం తీసుకున్నారు. వెంటనే ఖాతా నంబర్‌ను ఇచ్చారు. సహాయం చేస్తామని ఫోన్ చేసిన వారికి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తెలియజేశారు.
అకౌంట్ నంబర్: 133910100081668
తల్లిని కోల్పోయి, తండ్రి ఆసరాకు దూరమైన ఆ ఇద్దరు చిన్నారులను ఆదుకోవాలనుకునే దాతలు ఆర్. సాయి నిఖిత, అకౌంట్ నంబర్ 133910100081668 - ఐఎఫ్‌ఎస్ కోడ్ - ఏఎన్‌డీబీ 0001339, ఆంధ్రాబ్యాంక్ రాంనగర్ శాఖకు నేరుగా ఆర్థికసాయం అందజేయవచ్చు.