బాలికకు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న చైల్డ్‌లైన్ సిబ్బంది (బాలిక చేతిపై వాతలు)
ఏలూరు టౌన్ : మానవత్వం మరిచిన అమ్మమ్మ కర్కశంతో చిన్నారి చేతిపై వాతలు పెట్టిన ఘటన ఏలూరు తంగెళ్లమూడిలోని యాదవ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదవ్‌నగర్‌కు చెందిన కోలా లక్ష్మి అని ఆరేళ్ల బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అమ్మమ్మ మౌనిక వద్ద ఉంటోంది. మౌనిక నగరంలోని హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మౌనిక పనిముగించుకుని మంగళవారం రాత్రి తిరిగివచ్చే సమయానికి బాలిక లక్ష్మి ఇంటి వద్ద లేదు. రాత్రిళ్లు చుట్టుపక్కల వారి ఇళ్లకు వెళ్లి ఆలస్యంగా వస్తుందని, చెప్పిన మాట వినడం లేదని మౌనిక ఆగ్రహించింది.
బాలిక లక్ష్మి ఇంటికి రాగానే చిన్నారి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. తీవ్రంగా గాయాలు కావటంతో చుట్టుపక్కల వారు గమనించి ఏలూరులోని చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన చైల్డ్‌లైన్ సిబ్బంది బాలికను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. బుధవారం సాయంత్రం సోషల్ సర్వీస్ సెంటర్, చైల్డ్‌లైన్ డైరెక్టర్ అద్దంకి రాజు కౌన్సెలింగ్ నిర్వహించి బాలికను దెందులూరులోని బాలసదన్‌లో చేర్పించారు. బాలలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలిస్తే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. చిన్నారిని హోంకు చేర్చిన వారిలో చైల్డ్‌లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ ఆల్‌ఫ్రెడ్ గ్జేవియర్, కౌన్సిలర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment