వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారులు
సాక్షి, పాలకోడేరు(పశ్చిమగోదావరి): ప్రియుడితో కలిసి జల్సా చేసేందుకు.. తన పిల్లలనే కిడ్నాప్ చేయించిన ఓ వివాహిత బాగోతం బట్టబయలయ్యింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో రాజేష్ అలియాస్ రామకృష్ణ అద్దెకు ఉంటూ తాపీ పని చేస్తుంటాడు. అదే వీధిలోని ఓ కుటుంబంతో చనువుగా ఉంటూ ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల ఈ వ్యవహారం ఆమె అత్తకు తెలిసిపోవడంతో అత్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు హత్యాయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఘటన అనంతరం ప్రియుడితో వెళ్లి జల్సాగా జీవించాలనే ఆలోచనకు వచ్చిన వివాహిత.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన ఇద్దరు కుమారులను మామయ్యతో వెళ్లండని నచ్చచెప్పి పంపించింది. రాజేష్ వారిని గురువారం రాజమండ్రికి తీసుకెళ్లి ఒక లాడ్జిలో మకాం పెట్టాడు.
అనంతరం పిల్లల తల్లికి వాట్సాప్ ఫోన్ కాల్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే పిల్లల్ని చంపేస్తానని నానమ్మను బెదిరించాడు. దీంతో పిల్లల తండ్రి, నానమ్మ పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు నర్సాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, రూరల్ ఇన్‌చార్జి సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ రామచంద్రరావు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.
మహిళను అదుపులోకి తీసుకుని రాజేష్‌కి ఫోన్ చేయించారు. పిల్లలు ఎలా ఉన్నారని, వాట్సాప్‌లో ఫొటో పంపించమని అడిగించారు. దీంతో అతను ఫొటో పంపించగా, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు రాజమండ్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న రాజేష్‌ని శుక్రవారం అదుపులోకి తీసుకుని, పిల్లలను తండ్రికి అప్పగించారు. కిడ్నాప్‌నకు సహకరించిన వివాహితను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment